తెలంగాణ

telangana

ETV Bharat / state

KU Results: నేడు కేయూ దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు - తెలంగాణ వార్తలు

కేయూ డిగ్రీ చివరి సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫలితాల జాప్యంపై ఈనాడు-ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై ఉపకులపతి స్పందించారు. అధికారులతో చర్చించిన అనంతరం నేడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ku, results
కేయూ, పరీక్ష ఫలితాలు

By

Published : Jun 28, 2021, 8:42 AM IST

ఎట్టకేలకు కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన బీఏ, బీకాం, బీబీఏ పరీక్షల ఫలితాల విడుదలలో జరుగుతున్న జాప్యంపై ‘‘పరీక్షలు, ఫలితాలు.. ఇంకెంత దూరం!’’ శీర్షికతో ఆదివారం ‘‘ఈనాడు-ఈటీవీ భారత్’’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కేయూ ఉపకులపతి ఆచార్య టి.రమేష్‌ పరీక్షల అధికారులతో చర్చించారు.

ఫలితాల్లో జరుగుతున్న జాప్యంపై అడిగి తెలుసుకున్నారు. పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారి డాక్టర్‌ వై.వెంకయ్యలు పరీక్షల ఫలితాల విడుదలకు అన్ని సిద్ధం చేశారు. సోమవారం ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఎదురుచూపులు

దూరవిద్య ద్వారా పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు. ఫలితంగా వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఏళ్లు గడుస్తున్నా డిగ్రీలు పూర్తికాక సతమతమవుతున్నారు. 2018లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన ఒక బ్యాచ్‌ వారికి మూడేళ్లవుతున్నా మొదటి సంవత్సర పరీక్షలే నిర్వహించలేకపోయింది. ఈ బ్యాచ్‌లో యూజీ, పీజీ విద్యార్థులు కలిపి 2500 మంది వరకు ఉన్నారు. రెండేళ్లలో పీజీ, మూడేళ్లలో డిగ్రీ పూర్తిచేయాల్సిన విద్యార్థులు మూడేళ్లయినా మొదటి సంవత్సరమే పూర్తికాక విసిగిపోతున్నారు. ఇక డిగ్రీ, పీజీ చివరి సంవత్సర విద్యార్థులకు గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు జరపలేదు. ఎట్టకేలకు గత ఫిబ్రవరిలో అవి నిర్వహించినా ఇంకా ఫలితాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు ఏడాది వృథా అయింది. కొందరు విద్యార్థులు పరీక్షల ఎప్పుడా అని ఎదురు చూస్తుంటే , మరికొందరు ఫలితాల కోసం ఆశగా చూస్తున్నారు.

ఫలితాల జాప్యం

2018 డిసెంబరులో కాకతీయ దూరవిద్యా విభాగం పీజీ, యూజీ ప్రవేశాలకు అనుమతించింది. జూన్‌లో విద్యాసంవత్సరానికి ప్రవేశాలు జరిగాక.. మళ్లీ మధ్యలో మరో బ్యాచ్‌ను తీసుకునే వెసులుబాటు ఉంది. అలా విద్యా సంవత్సరం మధ్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు అదే ఏడాది జూన్‌లో చేరిన విద్యార్థులతో పాటు వార్షిక పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల యూజీసీ ఆ బ్యాచ్‌కు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థులు 2019లో మొదటి సంవత్సర పరీక్షలు రాయలేకపోయారు. వీరిని 2019-20 బ్యాచ్‌తో కలిపారు. 2020 మేలో మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా వేశారు. మొదటి దశలో కేసులు తగ్గాక దూరవిద్యా విభాగం వీరికి పరీక్షల తేదీలను 2020 అక్టోబరులో ఖరారు చేసి వాయిదా వేసింది. మళ్లీ 2021 ఫిబ్రవరిలో నిర్వహిస్తామని టైంటేబుల్‌ కూడా విడుదల చేసింది. మరోవంక.. పీజీ ద్వితీయ, డిగ్రీ చివరి సంవత్సర విద్యార్థులకు పరీక్షలు జరిగి అయిదు నెలలు గడుస్తున్నా ఫలితాల తేదీ వాయిదా వేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఫలితాలను ప్రకటించనున్నట్లు ఉపకులపతి ప్రకటించారు. నెలలుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఇది శుభవార్తే.

ఇదీ చదవండి:Dalit empowerment: దళిత సాధికారతకు వచ్చే నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు

ABOUT THE AUTHOR

...view details