రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటిదాకా 6 వేల మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8 సాయంత్రంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని.. కరోనా కారణంగా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తామన్నారు. నీట్ ర్యాంక్ కార్డు వచ్చిన ప్రతి విద్యార్థి నమోదు చేసుకొనే అవకాశం ఉందన్నారు. నీట్‌కు ఇచ్చిన డేటాలో అభ్యర్థి ర్యాంక్ మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
విద్యార్థులు తప్పని సరిగా తమ ఓరిజినల్ ధ్రువపత్రాలనే స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని.. దీనికి సంబంధించి అన్ని వివరాలు ప్రాస్పెక్టస్‌లో ఉన్నాయని కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సంబంధించి ఏప్రిల్ 2020 తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందని.. ఇక ఈ కోటాకు సంబంధించి సీట్ల భర్తీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.