Jagadish Reddy Fires on PM Modi: విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో కరెంట్ వినియోగం చేస్తే.. 10 నుంచి 20 శాతం ఛార్జీలు పెంచాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ‘టైం ఆఫ్ డే’ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్ర విద్యుత్ విధానాలు దేశాభివృద్ధికి అవరోధమని అన్నారు. విద్యుత్ రంగాన్ని మోదీ సర్కారు ప్రైవేట్ పరం చేస్తోందని దుయ్యబట్టారు. పీక్ లోడ్ అవర్స్‌లో విద్యుత్ వినియోగంపై టీవోడీ ఛార్జీల పేరిట అదనపు ఛార్జీలను వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Jagadish Reddy Fires on Central Govt: సామాన్య ప్రజలకు విద్యుత్ వినియోగం దూరం చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, ప్రజలపై భారం వేసే ఆలోచన దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగంపై అదనపు ఛార్జీలు వసూలు చేయడమంటే దేశ ప్రగతిని అడ్డుకోవడమేనని అన్నారు. మోదీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారే ప్రమాదం ఉందని చెప్పడానికి కేంద్రం తీసుకునే ఇలాంటి నిర్ణయాలే నిదర్శనమన్నారు. కార్పొరేట్లకు లాభం చేయడం కోసమే కేంద్రం చర్యలు కనిపిస్తున్నాయని, కేంద్రం ఎలాంటి వ్యాపారాలు చేయొద్దంటూనే బడా వ్యాపారుల కోసమే పని చేస్తున్నట్లు కనిపిస్తుందని దుయ్యబట్టారు.