Warangal District Rains News : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా జోరువానలు కురుస్తున్నాయి. విస్తారమైన వర్షాలతో చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. జనగామ మండలంలోని గానుగుపహాడ్ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. జనగామ, హుస్నాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వడ్లకొండ వద్ద జనగామ-నర్మెట్ట రహదారికి అడ్డుగా భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బచ్చన్నపేట మండలం సోలామైల్ వద్ద రహదారి తెగిపోవడంతో జనగామ-సిద్దిపేట రహదారిపై రాకపోకలు ఆగిపోయాయి. జనగామ మండలం వెంకిర్యాల వద్ద బొమ్మకుర్ రిజర్వాయర్ నుంచి సిద్ధంకి వరకు నిర్మాణం చేసిన కాలువ తెగడంతో.. సుమారు 250 నుంచి 300 ఎకరాల వరి నాట్లు పెట్టిన పంట పొలాలు నీట మునిగాయి.
Warangal Rains News : భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. కాశిబుగ్గలోని సాయి గణేశ్ నగర్‌తో పాటు డీకే నగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ఎనుమాముల 100 ఫీట్ రోడ్డు వద్ద వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వరద నీరు చేరడంతో గుడిసెవాసులు వాటిని వదిలివెళ్లారు. భారీ వర్షాలకు వర్ధన్నపేట మీదుగా ఉన్న ఆకేరు వాగులోకి.. వరద నీరు చేరి అలుగు పారుతుంది. ఇల్లందలోని సుభాశ్‌నగర్, శివనగర్‌లో వరద నీరు పోటెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరి బియ్యం, సామగ్రి తడిసి ముద్దయ్యాయి. అటు ఐనవోలు మండలం రాంనగర్-నందనం గ్రామాల మధ్య ఉన్న ఆకేరు వాగులోకి వరద నీరు చేరి పరవళ్లు తొక్కుతోంది. ఇల్లంద-కట్రాల గ్రామాల మధ్య ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూలి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు, మున్నేరు, పాకాల వట్టి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గార్ల మండల కేంద్రం నుంచి మద్దివంచ, రాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పనుల కోసం ఆయా గ్రామస్థులు గార్ల మండల కేంద్రానికి రైల్వే ట్రాక్ పైనుంచి చేరుకుంటున్నారు. పాకాల వాగులో కొట్టుకుపోతున్న ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని బయ్యారం మండల కేంద్రం సమీపంలో వెలికి తీసే ప్రయత్నం చేయగా.. ప్రవాహ ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో సాధ్యం కాలేదు. కొత్తగూడ మండలంలో మొండ్రాయిగూడెం వాగు పొంగి ప్రవహిస్తుండటంతో.. గుండంపల్లి, ఆదిలక్ష్మీపురం, తిమ్మాపురం, మొండ్రాయిగూడెం, చక్రాల తండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తగూడ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పొంగి ప్రవహిస్తున్న వాగుల వద్ద రహదారులపై.. బారికేడ్లు, ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి పోలీస్.. రెవెన్యూ అధికారులు పహారా కాస్తున్నారు.
భారీ వర్షాలతో ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామ ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వాగులు ఉప్పొంగిపోవడంతో రెండు మూడు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం సీతారాంపురానికి చెందిన కురసం సిద్దు అనే గిరిజనుడు వాంతులు, విరేచనాలు, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. గ్రామ సమీపంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో బంధువులు జెడ్డీ కట్టి.. జ్వర బాధితుడిని అతి కష్టం మీద వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కురసం బాబూరావు.. జ్వరం వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు.