వరంగల్లోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అంతకు ముందు అమ్మవారికి పసుపు, కుంకుమతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మకర వాహనంపై ఊరేగించారు. అన్నపూర్ణగా అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. భవానీ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
రోజుకో అవతారంలో
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుపొందిన అమ్మవారు... నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజుల్లో వివిధ రూపాల్లో అలంకరించనున్నారు. ఇవాళ అన్నపూర్ణ అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు తర్వాత గాయత్రి, మహాలక్ష్మి, లలితా మహా త్రిపురసుందరి, సరస్వతి దేవి, భద్రకాళీ, మహిషాసుర మర్ధిని అలంకరణల్లో భక్తులకు అమ్మావారు అభయప్రదానం చేస్తారు. ఈ నెల 16న భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణంతో శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తమౌతాయి.