పూజలతో ఆరోగ్యాలు బాగు చేస్తానని నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 23 లక్షల 69 వేల రూపాయాల నగదుతో పాటు 6 లక్షల విలువ గల 147 గ్రాముల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పట్టణ జిల్లా వంగర గ్రామానికి చెందిన కొలిపాక పద్మ ఈ కేసులో కీలక నిందితురాలని.. హన్మకొండ జూలైవాడలోని ఇళ్లలో పని మనిషిగా జీవనం కొనసాగించేదని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవిందర్ తెలిపారు. అయితే వచ్చే ఆదాయం సరిపోక పోవడం వల్ల అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనకు తెర తీసిందని సీపీ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే తాను పని చేసే ప్రాంతంలో రాజబాబు అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని సాయంతో దొంగ పూజలకు శ్రీకారం చుట్టిందని సీపీ తెలిపారు.
కుమారుడు విదేశాల్లో..
ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ముంజ వెంకటస్వామి జూలైవాడలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు విదేశాల్లో ఉండగా, కూమార్తె బెంగళూరులో ఉంటుంది. ఇంటిలో ఇద్దరే ఉండటం వల్ల నిందితులు వీరికి పూజలు చేస్తామని నమ్మబలికారు. నిందితురాలు పద్మ తన ఒంటిమీదకు రేణుకా అమ్మవారు వస్తుందని, రోగాలు నయం చేస్తానని వారిని నమ్మించింది. అయితే వారి మనవడికి ఆరోగ్యం బాగా లేదని చెప్పడం వల్ల ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పి రూ. 4 లక్షలు కాజేసింది. ఎలాగూ మనవడి ఆరోగ్యం బాగు పడటంతో యాజమానులకు వీరిపై నమ్మకం మరింత పెరిగింది.