Damera Rakesh's funeral: సికింద్రాబాద్ ఘటనలో బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయిన దామెర రాకేష్ అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం దబీర్‌పేట వైకుంఠధామంలో అశ్రునయనాల మధ్య దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు మృతదేహానికి ఎంజీఎంలో నేతలు నివాళులర్పించారు. రాకేష్ మృతికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెరాస నేతలు ఆరోపించారు. కేంద్రం అనాలోచిత విధానాలతో యువకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువతకు ప్రధాని క్షమాపణలు చెప్పాలన్న మంత్రి ఎర్రబెల్లి... అగ్నిపథ్ రద్దు చేసేంతవరకు పోరాడతామని స్పష్టం చేశారు.
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి అంతిమయాత్రలో పాల్గొని.. రాకేష్ పాడె మోశారు. అంతిమయాత్ర కొనసాగుతుండగా... వరంగల్‌లో అంబేడ్కర్ చౌరస్తాలో రోడ్డుపై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ కవిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠాయించారు. కేంద్రం తీరుని నిరసించారు.
రాకేష్ అంతిమయాత్ర కొనసాగుతున్న క్రమంలో... వరంగల్ గిర్నిబావి క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. రాకేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాకేష్ అంతిమయాత్ర కొనసాగుతున్న దారిలో పోచమ్మ మైదాన్ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపైనా దాడి జరిగింది. ఆందోళనకారులు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ముందు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపుచేశారు.
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు..: నర్సంపేట వరకు జరిగిన అంతిమయాత్రలో భారీ స్థాయిలో స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామం దబీర్‌పేటకు రాకేష్ మృతదేహం చేరుకోగా... కుటుంబసభ్యులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి. తెరాస నేతలు, స్థానికులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య రాకేష్ అంత్యక్రియలు పూర్తి చేశారు.