వరంగల్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి రసాభాసగా మారింది. గ్రేటర్ పరిధిలో నెలకొన్న సమస్యలపై అర్జీ పెట్టినప్పటికీ సమస్య మాత్రం తీరడం లేదంటూ నగరవాసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పరిధిలో కోతులు, కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉందని పలు కాలనీలకు చెందిన కాలనీవాసులు అర్జీ పెట్టుకున్నారు. బేస్తం చెరువు చిన్న వడ్డేపల్లి చెరువు అన్యాక్రాంతం అవుతున్నట్లు భూ పరిరక్షణ సమితికి చెందిన కమిటీ సభ్యులు.. అదనపు మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.
రంగ సాయి పేట గణేష్ నగర్లో బిల్డర్ల అక్రమ నిర్మాణాల జోరు పెరిగిందని అదే కాలనీకి చెందిన కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. నాలా పూడికతీత వేగం పెంచాలంటూ శివనగర్ ముంపు ప్రాంతాలకు చెందిన కాలనీవాసులు అదనపు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో నగరంలో సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోయాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.