వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ధరణిలో ఆస్తుల నమోదు, ఎల్ఆర్ఎస్ల పురోగతిపై బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని వేగంగా సాధించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నగర ప్రజల సౌకర్యార్థం బల్దియా పరిధిలోని 11 రెవెన్యూ వార్డు కార్యాలయాల్లో ధరణి నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా 12 వేల మంది తమ ఆస్తులను నమోదు చేసుకున్నారని తెలిపారు. గ్రేటర్ పరిధిలో 2,12,417 గృహాలకు గానూ 1,29,063 ఆస్తులు నమోదయ్యాయని.. ఇంకా మిగిలి ఉన్న 83,354 వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు నిబద్ధతతో కృషి చేయాలన్నారు.