CM KCR Public Meeting in Warangal : తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని.. ఆ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ ఇక్కడే నిర్వహించామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నది 95వ సభ అని పేర్కొన్నారు. వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడిగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)ను నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని.. మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది.. కాంగ్రెస్సేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారని ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన.. గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని వరంగల్ ప్రజలకు సూచించారు. 24 గంటల కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ నేతలు దిల్లీ గులాములు కాదు - మాకు ప్రజలే బాసులు : కేసీఆర్
BRS Praja Ashirvada Sabha at Warangal : కొన్ని రోజుల్లోనే వరంగల్‌లో టెక్స్టైల్ ఇండస్ట్రీలో(Warangal Textile Park) లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నిరుపేదలకు అనేక కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. రెండేళ్లలో టెక్స్టైల్ పార్క్‌లో మహిళలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరాన్ని మూడోసారి బీఆర్ఎస్ వస్తే మరింత అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. 24 అంతస్తుల కొత్త ఎంజీఎం భవనం.. హైదరాబాద్‌లో కూడా లేదని సీఎం కేసీఆర్ హర్షించారు. ఈ ఒక్క భవనం చాలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడానికి అని చెప్పారు. ఈ ఎన్నికలో గెలిస్తే ఆటో రిక్షాల కార్మికులకు.. ఫిట్నెస్ సర్టిఫికేట్ పర్మిట్ టాక్స్‌ను రద్దు చేస్తామన్నారు.