నెల వ్యవధిలోనే రెండోసారి వరంగల్ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత 25 కోట్ల రూపాయల వ్యయంతో ఐదెకరాల్లో నిర్మించిన కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో 2వేల పడకలతో నూతనంగా నిర్మించబోతున్న మల్టీ సూపర్ స్పెషాలీటీ ఆసుపత్రికి భూమిపూజ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 57 కోట్ల వ్యయంతో.... మూడంతస్తుల్లో కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు.
కెనడా తరహాలో నిర్మించాలి
వైద్యానికి వరంగల్ కేంద్రంగా ఉండాలని ఎంజీఎం పరిసరాల్లో 200 ఎకరాలు ఇందుకోసం అభివృద్ధి చేయాలని... ముఖ్యమంత్రి అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 34 అంతస్థుల్లో కెనడా తరహాలో నిర్మించాలని సీఎం ఆకాంక్షించారు. అవసరమైతే ప్రజాప్రతినిధులు, అధికారులు కెనడా వెళ్లి అక్కడి ఆసుపత్రులపై అధ్యయనం చేసి...వాటిని తలదన్నేలా నిర్మించాలన్నారు. ఆసుపత్రిని ఏడాదిన్నరలో కట్టి ప్రారంభించాలని తెలిపారు. వరంగల్‌కు కొత్త దంత వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్లు హర్షద్వానాలల మధ్య సీఎం ప్రకటించారు. పరిపాలనా సంస్కరణలు... పరిపుష్టం కావాలని... ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పనులు చకచకా జరగాలని... అదే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు. వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు మార్చాలని... రెండు మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.