వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లికి చెందిన బచ్చల చంద్రయ్య- సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు రాజు, సదయ్య, ఇరువురు కుమార్తెలున్నారు. 15 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు చనిపోయినా.. అన్నాతమ్ముడు, అక్కాచెల్లి ప్రేమానురాగాలతో ఉండే వారు. చిన్న నాటి నుంచే తమ్ముడంటే అన్నకు వల్లమాలిన ప్రేమ. ఇద్దరు సోదరులు స్నేహంగా ఉండేవారు. పెళ్లిళ్లయ్యాక బతుకుదెరువు కోసం నలుగురు ఎవరిదారిలో వారు వెళ్లినా ప్రేమలు మాత్రం తగ్గలేదు.
మరణంలోనూ వీడని సోదర బంధం - CRIME NEWS IN TELANGANA
చిన్నప్పటి నుంచి ఒకరిమీద ఒకరు పెంచుకున్న ప్రేమ మరణంలోనూ వీడలేదు. ఆస్తి తగాదాలంటూ... చిన్నచిన్న వాటికే కొట్టుకుని చచ్చే ఈ రోజుల్లో... సోదరుని మరణం తట్టుకోలేక కుప్పకూలిపోయిన ఘటన అందరినీ కలచివేసింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది.
వీరి అనుబంధాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో... భీంపల్లిలో నివాసముండే సోదరి జ్యోతి ఇంట్లో ఉంటున్న బచ్చల సదయ్య (41) ప్రమాదవశాత్తు గురువారం సాయంత్రం ఇంటి వద్ద కాలుజారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇంటి వద్దనే మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సదయ్య సోదరుడు బచ్చల రాజు (50) గురువారం రాత్రి భీంపల్లికి చేరుకున్నాడు. తమ్ముడు సదయ్య మరణం తట్టుకోలేక కంటతడిపెడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
సోదరి ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్న సదయ్య... కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడని తెలిపారు. గోదావరిఖనిలో నివాసముంటున్న రాజుకు భార్య, కూతురు, కుమారుడు రాకేశ్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరువురు మృతి చెందటం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరికీ భీంపల్లిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. రాజు తనయుడు రాకేశ్ ఇరువురి చితికి నిప్పు పెట్టిన సంఘటన గ్రామస్థులందరిని కంటతడి పెట్టించింది.