Bandi Sanjay on wardhannapet food poison incident : వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఆ బాలికలను హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. ఈ రెండు నెలల్లో గురుకులాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్న ఆయన.. గురుకులాల్లో కనీస వసతులు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే..వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల వసతి గృహంలో గత రాత్రి భోజనం చేస్తుండగా.. ఒకరి పళ్లెంలో బల్లిపడిన విషయాన్ని గమనించి గగ్గోలు పెట్టారు. అప్పటికే చాలా మంది భోజనం చేశారు. కొద్ది సేపటికే వాంతులు మొదలై విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని వర్ధన్నపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం 34 మంది విషాహారం తిన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. విద్యార్థుల ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులతో ఆరా తీశారు. హాస్టల్ వద్దకు చేరుకుని.. విద్యార్థులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.