తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మలకే అమ్మగా మారిన పెద్దమ్మ శ్రీదేవి

చిన్న వయసులోనే వందల మందికి అమ్మగా మారింది. బ్రతుకు భారంగా గడుపుతున్న అనాథ వృద్ధులను చేరదీసి తన ఒడికి చేర్చుకుంటుంది. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపుతున్న ఎంతో మందికి కౌన్సిలింగ్ నిర్వహించి అమ్మానాన్నల ప్రేమను అందిస్తోంది వరంగల్​కు చెందిన శ్రీదేవి.

అమ్మలకే అమ్మగా మారిన పెద్దమ్మ శ్రీదేవి

By

Published : May 12, 2019, 7:11 AM IST

Updated : May 12, 2019, 1:23 PM IST

అనాథ ఆశ్రమాలు లేని సమాజాన్ని చూడాలని కలలు కంటూ... మదర్ థెరిస్సా చేసిన సేవలో ఇసుమంతయినా సేవ చేయాలనే ఉద్దేశంతో 2014లో అమ్మ అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండకు చెందిన డాక్టర్ శ్రీదేవి. మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని, వృద్ధులను తీసుకొచ్చి ఆశ్రయం కల్పించింది. ఐదేళ్లుగా వారందరికీ తానే అమ్మగా మారి ఆలనాపాలనా చూస్తోంది.

ప్రస్తుతం అమ్మ అనాథాశ్రమంలో 85 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారంతా తమకు ఎవరూ లేరని భావించకుండా ఉండేందుకు రోజులో చాలా సేపు వారితోనే గడుపుతుంటారు శ్రీదేవి. తాము ఈ ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నామని, పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ... అనారోగ్యం పాలైతే ఆస్పత్రిలో చూపిస్తున్నారని ఓ వృద్ధురాలు తెలిపింది.

తల్లిదండ్రులు మలిదశలోకి రాగానే వారితో ఎలాంటి ఉపయోగం లేదని, వారికి సేవలు చేయలేక వృద్ధాశ్రమాలకు పంపిస్తున్న పిల్లలకు కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తుంటారు శ్రీదేవి. ఇప్పటి వరకు కౌన్సిలింగ్​లు ఇప్పించి 500 మంది వృద్ధులను వారి పిల్లల దగ్గరకు చేర్చారు. అలాగే ఫంక్షన్ హాళ్లలో, మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి బస్టాండు, రైల్వేస్టేషన్​లలో ఉండే వారికి అందజేస్తుంది. ప్రతి మూడు రోజులకు ఒకసారి నగరంలోని పాఠశాలలకు వెళ్లి మానవ సంబంధాలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, బాధ్యత విషయాలపై అవగాహన కల్పిస్తోంది. ఈమె చేస్తున్న సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున విశిష్ట మహిళా పురస్కారంతో సన్మానించింది.

ప్రస్తుతం అద్దె ఇంట్లో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ ఆశ్రమాన్ని గుర్తించి సొంత భవనం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించి ఆర్థికంగా సహకరించాలని శ్రీదేవి కోరుకుంటుంది. త్వరలో తల్లిదండ్రులు లేని పిల్లలను కూడా చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తానని చెబుతోంది.

అమ్మలకే అమ్మగా మారిన పెద్దమ్మ శ్రీదేవి
Last Updated : May 12, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details