తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు 2,384

ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను కరోనా కలవరపెడుతోంది. అర్బన్ జిల్లాలో రెండు రోజుల్లోనే... 242 కేసులు నమోదైయ్యాయి. సామాన్యులతో పాటు.. ప్రజాప్రతినిధులు, పోలీసులు, వైద్యులు కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండట్లేదు. వారంతా ప్రస్తుతం హౌం ఐసొలేషన్​లో ఉంటున్నారు. ఇళ్లలో సౌకర్యం లేనివారి కోసం... కాకతీయ వర్శిటీ విద్యార్థుల హాస్టళ్లు... ఐసొలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.

2,384 corona cases across Warangal Joint District
వరంగల్​ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు 2,384

By

Published : Jul 27, 2020, 3:55 PM IST

50.. 100... 131... 143.. ఇలా రోజురోజుకీ వరంగల్ పట్టణ జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమం ఇది. శనివారం ఒక్క రోజే జిల్లాలో 131 కేసులు రాగా.. ఆదివారం 111 కేసులు నమోదయ్యాయి. ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లతో పరీక్షలు చేయడం వల్ల కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి రాగానే.. తక్కనివారూ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. పాజిటివ్ వచ్చినవ్యక్తికి పరీక్షలు చేసి ఫలితం వచ్చేలోగా.. వైరస్ మిగిలినవారికీ సోకుతోంది.

ప్రయాణాలతో పెరుగుతున్న కొవిడ్

లాక్​డౌన్ సడలింపుల తరువాత.. వరంగల్, హైదరాబాద్ మధ్య రాకపోకలు పెరిగాయ్. ఇక్కడి నుంచి వివిధ పనుల నిమిత్తం రాజధానికి వెళ్లి తిరిగి వచ్చిన వారు.. నాలుగైదు రోజుల్లోనే.. కొవిడ్ వైరస్​కు గురవుతున్నారు. బంధువులు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లడం, చనిపోయిన వ్యక్తికి ఆ తరువాత.. కరోనా పాజిటివ్ ఫలితం రావడం...ఆ తరువాత ఇంటిల్లిపాదికీ సోకుతోంది. దుకాణాలు, మార్కెట్లు...ఇతర బహిరంగ స్ధలాల వద్ద... భౌతిక దూరం లోపించి...కొవిడ్ వైరస్​ను చేజేతులారా కొని తెచ్చుకుంటున్నారు. వైరస్ బారిన పడిన చాలామంది.. ‌హోం ఐసొలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్నారు. అద్దె ఇళ్లు.. ఇరుకు ఆవాసాలతో ఇళ్లలో ఉండలేని వారికోసం.. కాకతీయ వర్శిటీ బాలుర, బాలికల వసతి గృహాల్లో ప్రభుత్వం హోం ఐసొలేషన్ ఏర్పాటు చేసింది. 856 పడకలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. వారిలో చాలా మంది కోలుకోవడం విశేషం.

ప్రజాప్రతినిధులకు సైతం

ఇక సామాన్యులతోపాటు.. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు వారి వెంట ఉండే సహాయకలు, గన్​మెన్లు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. ఎస్కార్ట్, పైలెట్ వాహనాల్లో ఆరుగురు గన్ మెన్లతో పాటు మరో ఇద్దరికి పాజిటివ్ రాగా.. వాళ్లంతా క్షేమంగా ఉన్నట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. గత నెలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆయన భార్యతో పాటుగా.. డ్రైవర్ గన్​మెన్ మొత్తం ఐదుగురికి కరోనా సోకింది. వరంగల్ నగర ప్రథమ పౌరుడు మేయర్ గుండాప్రకాష్​రావు.... దంపతులకు కొవిడ్ సోకగా వారూ కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. మేయర్​తోపాటు సన్నిహితంగా ఉన్న అధికారులు, సిబ్బంది.. పరీక్షలు చేయించుకోగా.. డ్రైవర్, గన్ మెన్, అటెండర్, పారిశుద్ధ్య కార్మికురాలతోపాటు మొత్తం నలుగురికి వైరస్ సోకింది. అటెండర్ ఇంట్లో ఆయనతో సహా మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులకు కరోనా వచ్చింది.

హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్​కూ పాజిటివ్ రాగా... హైదరాబాద్​లో చికిత్స పొందుతున్నారు. రెండు మూడు రోజుల్లో కోలుకునే అవకాశాలున్నాయి. పాజిటివ్​ వచ్చి హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా కోలుకుంటున్నారు. వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు నాలుగు రోజుల క్రితం... కొవిడ్ బారిన పడ్డారు. కలెక్టర్ కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా నెగిటివ్ ఫలితాలు వచ్చాయ్. ప్రస్తుతం కలెక్టర్ హోం ఐసొలేషన్​లో ఉన్నారు. భాజాపా నగర అధ్యక్షురాలు రావుపద్మకు కూడా కరోనా వైరస్ సోకగా హైదరాబాద్​లో చికిత్స పొందుతున్నారు. ఇక పోలీసులు, వైద్యులు, నర్సులు చాలా మంది కొవిడ్ బారిన పడ్డారు.

ఉద్యోగులనూ వదలని కరోనా ..

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయ ఉద్యోగులనూ కరోనా కలవరపెడుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిబ్బంది 13 మంది కొవిడ్ బారిన పడ్డారు. నగరంలోని పోచమ్మ మైదానంలో విద్యుత్ శాఖ సర్కిల్లో ఐదుగురికి పాజిటివ్​గా వైద్యులు నిర్ధరించారు. వరంగల్ పట్టణ జిల్లా అంత స్థాయిలో కాకున్నా.. వరంగల్ గ్రామీణ జిల్లా, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోనూ వైరస్ చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. మహబూబాబాద్, భూపాలపల్లిలో ఆరంభంతో పోలిస్తే...కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు ఎక్కువవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. 2384 మందికి వైరస్ సోకగా... ఇప్పటిదాకా 43 మంది చనిపోయారు. వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ స్వచ్చంద లాక్​డౌన్​ను దుకాణదారులు.. కాలనీవాసులు పాటిస్తున్నా....వైరస్ కట్టడి కావట్లేదు.

ఇదీ చూడండి :ముఖ్యమంత్రిని ఆ వాహనంలోనే తీసుకెళ్తారా..? సీఎల్పీ నేత భట్టి

ABOUT THE AUTHOR

...view details