Govt Job to Medico Preethi Younger Sister : దివంగత మెడికో ప్రీతి చెల్లెలు పూజకు హెచ్ఎండీఏలో ఉద్యోగం లభించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆమె చెల్లెలు పూజకు ఐటీ సెల్ లో ఒప్పంద విధానంలో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇప్పించారు. ఈ మేరకు కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
హామీని నిలబెట్టకున్న ప్రభుత్వం..: ప్రీతి దుర్ఘటన బాధాకరమన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... ఈ ఘటన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని అన్నారు. కుటుంబానికి అండగా ఉన్నామన్న ఆయన... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మనసున్న మహారాజులని, మాట ఇస్తే తప్పరని వ్యాఖ్యానించారు. ఆ రోజు వచ్చి మాట్లాడిన ఒక్క ముఖం కూడా మళ్ళీ కనిపించలేదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెకు తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. నిమ్స్‌లో అయిదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి మరణించింది.
TS High Court Notice On Preethi Death: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు.. హత్యనా.. లేక ఆత్మహత్యనా అనేది స్పష్టంగా తెలియడం లేదు. వరంగల్ సీపీ రంగనాథ్ ఆమెది ఆత్మహత్యే అని తేల్చి చెప్పినా సరే.. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు దానిని హత్యగానే భావిస్తున్నారు. ఈ అనుమానాలపైనే తెలంగాణ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.మల్లయ్య హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి.. విచారణను చేపట్టింది. ఈ విచారణలో వైద్య విద్యార్థి ప్రీతి మృతిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంపై స్పందన తెలపాలని సీఎస్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, డీఎంఈ, వరంగల్ సీపీ, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అనస్థీషియా విభాగం అధిపతికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: