లాక్డౌన్ సమయంలో... వినియోగదారులకు కూరగాయలు, నిత్యవసరాల కొరత తలెత్తకుండా... వరంగల్ గ్రామీణ జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పండిన కూరగాయలు, పుచ్చకాయలను నగరవాసులకు చేరవేసేందుకు బాటలు వేస్తోంది. ఇదే సమయంలో ఫోన్ చేసి నిత్యావసర వస్తువులు ఇంటికే తెప్పించుకునేలా చర్యలు చేపట్టారు.
రైతు నుంచి నేరుగా వినియోగదారుడికి
వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న లాక్డౌన్ పరిస్థితి వల్ల చేలల్లో పంట వినియోగదారునికి చేరడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా అధికారులు వినూత్న మార్గానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరి యువకులను ఎంపిక చేసి వారికి పాస్లు పంపిణీ చేసి కూరగాయలు, ఇతర పంటలు నగరంలో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల జనం గుంపులుగా అవడం నియంత్రించడమే కాకుండా రైతుకు మేలు జరుగుతోందంటున్నారు కలెక్టర్ హరిత.