ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తూ... తమ పొట్టకొడుతున్నారని ఓ ఎస్సీ రైతు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(HRC)ను ఆశ్రయించారు. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన రైతు దక్క కుమార స్వామికి ఊకల్ గ్రామ రెవెన్యూ పరిధిలో 2 ఎకరాల 5 గుంటల పట్టా భూమి(AGRICULTURE LAND) ఉందని తెలిపారు. తాను సాగు చేసుకుంటున్న భూమిలోకి గ్రామానికి చెందిన ఎంపీటీసీ బేతినేని వీరారావు, ఉపసర్పంచ్ ముడుసు శ్రీనివాస్ రెడ్డి చొరబడ్డారని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
తన భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను, రాళ్లను దౌర్జన్యంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు తనపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు... కులం పేరుతో దూషించారని తెలిపారు. భూమిని వదిలి వెళ్లకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని... ఈ విషయంపై గీసుగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా... పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్‌లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. నాలుగు నెలలు గడుస్తున్నా వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. కేసు ఉపసహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై భూమిని కబ్జా చేసిన అధికార పార్టీ నాయకులపై... నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని... తనకు ప్రాణరక్షణ కల్పించాలని బాధిత రైతు హెచ్చార్సీని వేడుకున్నారు.