Anantalakshmi Govt Ayurveda College:వరంగల్‌లోని అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో అధ్యాపకుల కొరత, మౌళిక వసతులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. 2023 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది ప్రవేశాలను రద్దు చేస్తూ.. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసన్ నిర్ణయం తీసుకోవడం విద్యార్థులను అయోమయానికి గురి చేస్తోంది. వాస్తవానికి సీట్ల కేటాయింపు విషయంలో 2014లోనే ఎన్ఐసీఎస్ఎం అభ్యంతరం తెలిపింది.
తీరు మార్చుకుంటామని కళాశాల యాజమాన్యం హామీ ఇస్తూ 8 ఏళ్ల నుంచి అనుమతులు తీసుకుంటూనే ఉంది. ఎంతకీ తీరు మారకపోవడంతో ఈ కళాశాలపై వేటు తప్పలేదు. ఈ ఏడాది అడ్మిషన్లు రద్దు చేయడంపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కళాశాలకు ప్రవేశాలను రద్దు చేయడం వల్ల 63 మంది విద్యార్థులు బీఏఎమ్ఎస్ కోర్సులో చేరే అవకాశాన్ని కోల్పోయారు. కనీసం ఈ కళాశాలకు బస్సు సౌకర్యం కూడా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడి వసతి గృహంలో నీటి సౌకర్యం, సరైన బాత్‌రూంలు లేవని వాపోతున్నారు. కళాశాలలో సరిపడా అధ్యాపకులు లేరని.. కనీసం ల్యాబ్‌లో ఉండాల్సిన పరికరాలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారు. డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై సమీక్ష నిర్వహించి త్వరలోనే వారి సమస్యలు నెరవేరుస్తామని అధికారులు చెబతున్నారు. అధికారులు ఇప్పటికి ఎన్నోసార్లు హామీలు ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు.