వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో చనిపోయినవారికి దహనసంస్కారాలు చేసేందుకు సరైన ఏర్పాట్లు లేక గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పాతకాలం పద్ధతులకు స్వస్తి చెప్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో పాటు గ్రామ సర్పంచ్ తోడ్పాటుతో గ్రామంలో అద్భుతమైన వైకుంఠధామం నిర్మించుకున్నారు. అధునాతనమైన నిర్మాణాలు చేపట్టి అనేక హంగులు జోడించారు. మృతదేహాలను ఖననం చేసేందుకు వచ్చిన వారికి మనోధైర్యాన్ని కలిగించే విధంగా చక్కని గార్డెన్ ఏర్పాటు చేశారు. అందులో పూల మొక్కలు నాటారు. పురుషులకు, స్త్రీలకు ప్రత్యేక స్నాన గదులు నిర్మించుకోవడమే కాక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా నీడనిచ్చే చెట్లు సైతం పెంచారు.
శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ:
పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామంలో సకల సౌకర్యాలతో కూడిన శ్మశాన వాటికలు సిద్ధమవుతున్నాయి. వీటి నిర్మాణం ప్రధానమని భావించిన రాష్ట్ర సర్కారు ఉపాధి హామీ నిధులు కేటాయించడం వల్ల పలుచోట్ల వైకుంఠధామాలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తపల్లిలో నిర్మించిన వైకుంఠధామానికి రూ. 10 లక్షలు కేటాయించగా మరో 3 లక్షలు అదనంగా కలుపుకొని మూడు నెలల్లో అన్ని హంగులతో వైకుంఠధామం నిర్మించారు. ప్రాంగణంలో శివుడి విగ్రహం ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. శ్మశాన వాటిక చుట్టూ ఇనుప కంచెతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బోరు ద్వారా.. మొక్కలకు, ఇతర అవసరాలకు నీటి సరఫరా చేసేందుకు వైకుంఠ పాలకులను కూడా నియమించారు.