వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్లోని బాలవికాస స్వచ్ఛంద సంస్థ... అనాథ, వింతతువుల పిల్లలు, నిరుపేద విద్యార్థులకు విద్యాపరంగా సహయసహకారాలు అందిస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళాభివృద్ధి పథకంలో సభ్యులుగా ఉన్న వారి కుటుంబాలకు చెందిన పిల్లలను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ప్రస్తుత కొవిడ్ కారణంగా నిరుపేద విద్యార్థులు ఎవరూ ఆన్లైన్ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో... దాతల సహకారంతో వేయికి పైగా స్మార్ట్ఫోన్లను విద్యార్థులకు అందించారు.
దాతల సహకారంతో..
వితంతువులు, పేద కుటుంబాలకు చెందిన పిల్లల నుంచి కొంత నామమాత్రపు నగదును తీసుకొని... కెనడాలోని దాతల సహకారంతో 700 స్మార్ట్ఫోన్లను ఈ సంస్థ పంపిణీ చేసింది. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు అమెజాన్ సంస్థ సహకారంతో 400 ట్యాబ్ ఫోనులను పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. కాజీపేట్లోని ప్రధాన కార్యాలయంతో పాటుగా... వర్ధన్నపేట, దంతాలపల్లి, బెజ్జెంకి, హుజూరాబాద్, హైదరాబాద్ కార్యాలయాలలో ఈ ఫోన్ల పంపిణీని నిర్వహించారు.