Damage to crops due to rains: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులను కుదేలు చేశాయి. అధిక వర్షాలతో పంట నేల వాలి నష్టం మిగిల్చింది. ఒక్కో ప్రాంతంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో పంటలు కుప్పకూలిపోయాయి. మరికొన్ని చోట్ల అధిక వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఆరబోసిన మిర్చి కల్లాల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఉప్పెడు సమీప ఇసుకపాయలో అరబెట్టిన మిర్చి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ఆదుకోవాలంటూ బోరున విలపిస్తున్నారు. జయశకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం, చిట్యాల, రేగొండ, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో రాత్రి వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. ఒక్కసారిగా వడగళ్ల వాన కురవడంతో నగరంలోని పలుచోట్ల చెట్లు నేలకూలాయి. గాలివాన బీభత్సానికి రంగసాయిపేట కిల్లా వరంగల్ ప్రాంతాల్లో ఇంటిపై కప్పులు విరిగి కిందపడ్డాయి. గవిచర్ల క్రాస్ రోడ్డు వద్ద పలు దుకాణాల పైకప్పులు ఎగిరిపోవడంతో కొంతమేర ఆస్తి నష్టం వాటిల్లింది. నగరంలోని పలు అపార్ట్మెంట్ల కిటికీలు వడగళ్ల వర్షం ధాటికి ధ్వంసమయ్యాయి. నగరంలోని పలుచోట్ల నిన్న రాత్రి నుంచి విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో కరెంటు లేక విశ్వనాథ్ కాలనీతో పాటు నాగేంద్ర నగర్ ఎస్సీ కాలనీ పడమరకోట వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.