వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్ నగరంలో ఉదయం నుంచి కురిసిన వర్షానికి జలమయమైన కాలనీలను ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పరిశీలించారు. హన్మకొండలోని బ్యాంక్ కాలనీ, సమ్మయ్యనగర్, వడ్డేపల్లి, తదితర ప్రాంతాలను పరిశీలించారు.
వర్షం పడినప్పుడల్లా కాలనీలు మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే వినయభాస్కర్కు స్థానికులు గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. వెంటనే రూ. 3 కోట్లు కేటాయించారని... త్వరలోనే శాశ్వత పనులు జరుగుతాయని తెలిపారు. నగరవాసులకు వరద నీరు నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.
నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కుండపోత వాన కురవడం వల్ల జనావాసాలన్నీ నీటితో నిండిపోయాయి. నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట వీధి మొత్తం వర్షపు నీటితో పొంగిపొర్లింది. పత్తి పంటలో నీరు నిలిచింది. మొక్కజొన్న పంటలు నేలకువాలాయి. ఖానాపురం మండలం బుధరావుపేట వద్ద 365 నెంబరు జాతీయ రహదారిపై నిర్మాణంలో బ్రిడ్జిపై నుంచి వరద పొంగింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.