తెలంగాణ

telangana

ETV Bharat / state

Floods in Warangal : ఏరూ-ఊరూ ఏకమైంది.. ఓరుగల్లు వాసులను నిండా ముంచింది - Mulugu District News

Warangal Rains Latest News : ఏరూ ఊరూ ఏకమవుతోంది. వాగూ వంక పొంగి పొర్లుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా.. వరుణుడి విలయానికి ఉత్తర తెలంగాణ జిల్లాలు విలవిల్లాడాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు.. మారుమూల తండాల నుంచి నగరం దాకా ప్రజలందరినీ అల్లకల్లోలం చేశాయి. వరదల ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోగా.. గల్లంతైన మరికొందరని అతికష్టం మీద సహాయక సిబ్బంది రక్షించారు. ఉప్పొంగే వాగులతో రాకపోకలు స్తంభించి.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

Floods
Floods

By

Published : Jul 27, 2023, 7:32 PM IST

ఓరుగల్లులో వాన కురిసింది.. వరద ముంచింది

Floods in mulugu district : రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో 61 సెంటీమీటర్లతో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అల్లకల్లోలం చేసిన ఈ భారీ వర్షాలు.. ములుగు, భూపాలపల్లి జిల్లాలను కుదిపేశాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట శివారు మారేడుగొండ చెరువుకట్టకు 3 చోట్ల గండిపడగా.. ప్రవాహానికి ఓ ఇల్లు కొట్టుకుపోయింది.

ఇంట్లో నిద్రిస్తున్న బండ సారమ్మ, సారయ్య, రాజమ్మ కొట్టుకుపోగా.. వీరిలో సారయ్య మృతదేహం లభ్యమైంది. మిగతా వారి ఆచూకీ లభించలేదు. గోవిందరావుపేటలోని బ్రిడ్జి వద్ద దయ్యాలవాగు వరద ఉద్ధృతికి ఇళ్లల్లోకి వరద నీరు చేరగా.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పస్ర సమీపంలో జాతీయ రహదారిపై గుండ్లవాగు కట్టకు గండిపడగా.. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపూర్, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి-పస్ర గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న జలగలంచవాగు బ్రిడ్జి తెగిపోయింది.

rains in bhupalapally : మేడారంలో జంపన్నవాగు ఉద్ధృతికి నార్లాపూర్, మేడారం, ఊరట్టం గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. మేడారానికి చెందిన ముగ్గురు వరదలో చిక్కుకోగా.. ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది రక్షించారు. మేడారం గద్దెల వద్ద ఐటీడీఏ అతిథి గృహం, తిరుమల తిరుపతి అతిథి గృహాల వద్ద వరదల్లో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బూరుగుపేట చెరువు గండిపడటంతో భూపాలపల్లి - ములుగు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయం మతడిపోస్తోంది. ములుగు సమీపంలోని లోకం చెరువు మత్తడి తెగిపోగా.. వరద ఉద్ధృతంగా ప్రవహిస్తూ మేడివాగు వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రామప్ప చెరువుకు భారీ వరద కారణంగా పాల్‌సాబ్‌పల్లికి చెందిన 15కుటుంబాలను పునరావాలకు తరలించారు.

ఇల్లు కూలి వ్యక్తి మృతి.. అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆరెవాగు, తీగలవాగు, మానేరువాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రేగొండ మండలం రావులపల్లిలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఇంటిపై చెట్టుకూలి.. మద్ది వెంకటస్వామి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నకోడపాక చెరువు, దమ్మెన్నపేట, కాకర్లపల్లి చెరువుల కట్టలు తెగాయి.

మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లి జల దిగ్బంధమైంది..: అయిదడుగుల మేర ఇళ్లలోకి నీరు చేరింది. భయాందోళనకు గురైన గ్రామస్థులు ఇళ్లపైకి, చెట్లపైకి ఎక్కి సాయం కోసం వేడుకున్నారు. నాలుగైదు గంటల పాటు అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హెలీక్యాప్టర్లు రంగంలోకి దిగగా.. బాధితులందరినీ ఎన్డీఆర్​ఫ్​ సిబ్బంది రక్షించి పునరావాసాలకు తరలించారు.

సెల్​టవర్​పై పిడుగు.. కొయ్యూరు- తాడిచెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయం జలమయమైంది. ఘనపురంలోని ఘనపసముద్రం చెరువు మత్తడి పోస్తోంది. భారీవర్షాలకు, పొంగుతున్న వాగులకు జిల్లాలోని చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించగా.. బుధవారం రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గణపురంలో సెల్‌టవర్‌పై పిడుగుపడటంతో టవర్​ నుంచి ఎయిర్‌టెల్‌ సేవలు నిలిచిపోయాయి.

భూపాలపల్లి సింగరేణి 2,3 ఓపెన్ కాస్ట్‌లలోకి వరద నీరు చేరి, బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు బొగ్గు రవాణా నిలిచిపోయింది. టేకుమట్ల-రాఘవరెడ్డిపేట మార్గంలోని వంతెన కూలిపోగా.. మొగుళ్లపల్లిలో వరద ఉధ్ధృతికి చెరువు పక్కనున్న బతుకమ్మ విగ్రహం కుప్పకూలింది. మహబూబాబాద్​నుంచి ఇల్లందు, కేసముద్రం నుంచి గూడూరు, బయ్యారం నుంచి మొట్ల తిమ్మాపురం, గార్ల నుంచి రాంపురం, మద్దివంచ, గార్ల నుంచి డోర్నకల్, సత్యనారాయణపురం, గోపాలపురం, తొర్రూరు నుంచి నర్సంపేట ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. కొత్తగూడ, గంగారాం ఏజెన్సీ మండలాల్లో అనేక గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తులారం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోగా.. జిల్లాలో 1600 వందల చెరువులకుగాను 600 చెరువులు అలుగులు పారుతున్నాయి. 500లకు పైగా చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరుకుంది. బయ్యారం మండలం నామాలపాడు శివారులో.. మహబూబాబాద్ - ఇల్లందు ప్రధాన రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిన్నెలవాగు ప్రవాహంలో ఆర్టీసీ బస్సు చిక్కుకోగా.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

బయ్యారం మండలం ఇర్సులాపురం -కట్టుగూడెం గ్రామాల మధ్య వాగు ఉద్ధృతికి మోటార్‌సైకిల్‌ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోతుండగా.. స్థానికులు రక్షించారు. డోర్నకల్ మండలంలో మున్నేరు వాగు కట్ట తెగిపోవటంతో తెగడంతో వరద నీరంతా పంట పొలాల మీదుగా ప్రవహిస్తోంది. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలోని కల్వర్టు వద్ద వరద ఉద్ధృతి కారణంగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లే పలురైళ్లను కేససముద్రం రైల్వేస్టేషన్‌లో మూడు గంటల పాటు నిలిపివేశారు.

15 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..పొంగుతున్న కల్వర్టుల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ...క్యాషన్ ఆర్డర్‌తో రైళ్లను పంపించారు. తొర్రూరు మండలం అమ్మాపురం వద్ద వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితిని మంత్రి సత్యవతి రాథోడ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జనగామ జిల్లా చిటకోడూరు డ్యాం నిండిపోగా.. గేట్లు ఎత్తినా డ్యాం పైనుంచి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో యశ్వంతాపూర్ వాగు ఉద్ధృతితో 15 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. లింగాలగణపురం మండలంలో కుందారం, చీటూరు వాగులు పొంగుతుండటంతో జనగామ, పాలకుర్తి ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి.

గుమ్మడవెల్లి చెరువు ఉద్ధృతికి జీడికల్ ప్రాంతాలకు, చీటకోడూరు, వడ్లకొండ వాగులు పొంగి జనగామ, హుస్నాబాద్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ పట్టణంలో పలుఇళ్లలోకి వరద నీరు చేరి జలమయమయ్యాయి. పెంబర్తి వద్ద ఆర్టీవో కార్యాలయం నీటమునిగింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం మత్తడి వాగులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పొన్నాల మహేందర్‌ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ.. ఉప్పొంగుతున్న వాగును దాటేందుకు ప్రయత్నించి కొట్టుకుపోయాడు. కొంతదూరంలో మృతదేహం లభ్యమైంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details