Paddy Crop Damage in Telangana : అకాల వర్షాల ధాటికి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ యాసంగిలో.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున కురిసిన భారీవర్షం.. పలు చోట్ల బీభత్సం సృష్టించింది. హనుమకొండ, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్‌లో వరి తడిసి ముద్దైంది. జోరువాన, ఈదురుగాలుల ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. కాంటాలకు సిద్ధమైన ధాన్యం తడిసి ముద్దవడంతో.. అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
Crop Damage due to Sudden Rains in Telangana : గన్ని సంచులు కాంటాలు, లారీల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగబట్టినట్లుగా వర్షాలు కురవటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నామని తెలిపారు. గతంలో పలుమార్లు కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోగా.. కొనుగోలు కేంద్రాల వద్ద మరోసారిపంట తడిసిపోవడంతో.. కన్నీటి పర్యంతం అవుతున్నారు. టార్పాలిన్ కవర్ల కొరత రైతుల కష్టాలను రెట్టింపు చేస్తోంది. చాలా చోట్ల టార్పాలిన్ పరదాలు లేక ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. త్వరితగతిన కాంటాలు జరిపినట్లయితే పంట తడిచేది కాదని రైతులు చెబుతున్నారు.
Farmers protest in Telangana : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో.. పరకాల మార్కెట్ యార్డు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. టార్పాలీన్లు సరిపడా లేకపోవడంతో నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు.