తెలంగాణ

telangana

ETV Bharat / state

Chilli Farmers Suicides: మిర్చి రైతుల గోస... దిగుబడి రాక బలవన్మరణాలు

Chilli Farmers Suicides: తామర పురుగు ఉద్ధృతి మిర్చి రైతును గోస పెడుతోంది. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించకపోవడం వల్ల వేసిన పంటనే దున్నేస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో మిల్కారెడ్డి అనే రైతు... పంట నష్టపోయానన్న ఆవేదనతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Chilli
మిర్చి

By

Published : Dec 17, 2021, 5:03 PM IST

Chilli Farmers Suicides: ఉమ్మడి వరంగల్ జిల్లా మిర్చి రైతులను కొత్త జాతి తామర పురుగు... తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నెల రోజుల్లోనే పంట మొత్తం పురుగులు వ్యాపించి... చేనును ఎందుకు పనికిరాకుండా చేస్తున్నాయి. తామర పురుగుకు తోడు ఇతర తెగుళ్లు దాడి చేయడం వల్ల రైతులు ఎప్పుడూ లేనంత నష్టాలను చవిచూస్తున్నారు. పూత కాత లేకపోవడం వల్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చపాటా, తేజ వంటి మేలు రకం మిర్చి రైతులు... లక్షల్లో నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఎన్ని పురుగు ముందులు వాడినా ఫలితం లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక మిరప రైతులు తల్లడిల్లుతున్నారు. కొందరు అదనపు డబ్బులు వెచ్చించి... పంటను ట్రాక్టర్లతో దున్నించేస్తున్నారు.

బలవన్మరణం...

ఇదే సమయంలో తామర పురుగు, ఇతర తెగుళ్లు రైతుల ఉసురు తీస్తున్నాయి. సాగు చేసిన మిరప పంటకు తామర పురుగు సోకడం వల్ల మనస్తాపానికి గురైన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరుపల్లికి చెందిన మిల్కారెడ్డి అనే రైతు ముూడెకరాల చేనులో మిర్చి వేశారు. నెల రోజుల ముందే చేనుకు తామర పురుగు సోకింది. కాయ పూత లేకపోవడం చూసి తీవ్ర ఆవేదన చెంది... తోట వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడెకరాల్లో మిరపతో పాటుగా మరో ఒకటిన్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. అది కూడా దిగుబడి రాకపోవడం... 4 లక్షల మేర నష్టం రావడం వల్ల దిగులుతో ఆత్మహత్య చేసుకున్నట్లు... కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

వారం వ్యవధిలో నలుగురు...

వారం వ్యవధిలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నలుగురు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం... సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఈనెల 15న జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం, సుబ్బక్కపల్లి గ్రామంలో ఇదే సమస్యతో మిరప చేను వద్దే పురుగు మందు తాగి... మిర్చి రైతు రవీందర్ రావు ప్రాణాలు తీసుకున్నారు. అంతకు మూడు రోజుల ముందు... ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామంలో హనుమయ్య అనే రైతు, ఈ నెల 12న మహబూబాబాద్ జిల్లా దూధ్యా తండాలో మిరప రైతు బిక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో...

ప్రత్యామ్నాయం రాక... గత్యంతరం లేని పరిస్థితిల్లో రైతులు వేసిన మిరప పంటను తీసేసి మక్కలు... ఇతర పంటలు సాగును మొదలుపెట్టగా పంట తీసేందుకు అదనంగా డబ్బులు వెచ్చించలేని వారు అలాగే వదిలేస్తున్నారు. ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు, శాస్త్రవేత్తలు పురుగుల నివారణకు ఎలాంటి మందులు వాడాలో సూచిస్తే కనీసం ఉన్న కాస్త పంటనైనా కాపాడుకోగలమని రైతులు అంటున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details