Prime Minister Narendra Modi Warangal Tour : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వే వ్యాగన్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కాజీపేట్‌లో ఏర్పాటు అయ్యే ఈ వ్యాగన్ యూనిట్ వల్ల పరిసర ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాగాన్ల ఉత్పత్తి యూనిట్‌ను లాంఛనంగా శంకుస్థాపన చేస్తారని ఆయన ప్రకటించారు. కాజీపేట సమీపంలోని అయోధ్యపురం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం అరుణ్ కుమార్ జైన్ వ్యాగన్ ఉత్పత్తి యూనిట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయని.. ఐదోది వరంగల్ కాజీపేటలోని అయోధ్యపురంలో రాబోతుందన్నారు. 160 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.521 కోట్ల అంచనా వ్యయంతో వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. గతంలో పిరియాడికల్ ఓవరాలిక్ యూనిట్‌ను అప్ గ్రేడ్ చేస్తూ, వ్యాగన్ ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తామన్నారు. దీనికి గతంలో ఉన్న టెండరే కొనసాగుతుందని, సప్లమెంటరీ టెండర్ కూడా ఉంటుందని తెలిపారు. ఇక్కడ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోబోటిక్ పెయిటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ఈ యూనిట్‌లో కంప్యూటరైజ్డ్ మిషన్లు వినియోగిస్తామన్నారు. ఇక్కడ అన్ని రకాల రోలింగ్ స్టాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.