వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపర్తిలో చేపట్టిన నిరాహార దీక్షను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS SHARMILA) విరమించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కొండల్ స్నేహితుడు రఘు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం గ్రామంలోని అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఇవాళ ఉదయం గ్రామంలోని బస్టాండ్ చౌరస్తాలో నిరాహార దీక్ష చేపట్టారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాట తప్పారు
ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కనీసం వారికి ఇస్తానన్న రూ.3,116 నిరుద్యోగ భృతి ఏమైందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. 54 లక్షల మంది టీఎస్సీఎస్సీ ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. పీఆర్సీ ప్రకారం రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. కొత్తగా ఏర్పడిన జిల్లాల సిబ్బందిని కలుపుకుని 3 లక్షల 85వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
షర్మిల కంటతడి..!