ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వనపర్తి జిల్లా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిండుకుండను తలపిస్తున్న చెరువుల అలుగులు పారుతూ.. పట్టణంలోకి ప్రవహిస్తూ.. రాకపోకలు స్తంభించిపోయాయి. పట్టణానికి సమీపంలో గల చెరువులన్నీ వనపర్తి పట్టణంలోకి ప్రవహించి కాలనీల గుండా ప్రవహిస్తూ.. నివాసాల్లోకి నీళ్లు చేరుతూ జనాలు ఇబ్బంది పడుతున్నారు.
వనపర్తి ప్రజలకు.. వాన తిప్పలు! పట్టణాలకు సమీపంలో ఉన్న చెరువులు కుంటలు ఆక్రమణకు గురి కావడం వల్ల ఆ స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, వేసిన వెంచర్లు వరద నీటిలో మునిగాయి. ఇటీవలి వర్షాలకు వనపర్తి పట్టణ సమీపంలోని తాళ్ళచెరువు వాగు ఉప్పొంగి.. శ్వేత నగర్, భగత్ సింగ్ నగర్, రాయిగడ్డ, హనుమాన్ టేకిడి, శంకర్రాం గంజ్, బ్రహ్మం గారి వీధి, దామోదర్ తోట, ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
పట్టణ సమీపంలోని తాళ్ళచెరువు విస్తీర్ణం అధికారుల దస్తావేజుల్లో 40 ఎకరాలు ఉంది. ఈ క్రమంలో పట్టణ విస్తరణ జరుగుతుండటంతో చెరువు చుట్టూ వెంచర్లు వెలిశాయి. చుట్టూ ఉన్న 15 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు తాళ్ళచెరువు పొంగి.. వర్షపు నీరు చుట్టూ ఉన్న కాలనీల్లోకి వచ్చింది. వంద అడుగుల మేర వెడల్పు ఉన్న వాగు ఆక్రమణకు గురై 30 అడుగులు మాత్రమే మిగిలింది.
వాగును ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించుకోవడం వల్లనే ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పట్టణం నుంచి వెళ్లే తాళ్ళచెరువు వాగు నిర్మాణంపై అక్రమ కట్టడాలు నిర్మించిన వాటిని వెంటనే తొలగించి వాగు పునరుద్ధరణ చేపడితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తవని కోరుతున్నారు.
ఇదీ చదవండి:మింగేస్తున్న నాలాలు.. చలించని అధికారులు!