దక్షిణ తెలంగాణ ప్రాంతంలో నీటి సమస్య నివారణకు పాలెం లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం... స్థానిక పరిస్థితులను తట్టుకొనే పంటరకాలను రూపొందించి రైతులకు సాయం చేస్తోంది.
రైతులకు విలువైన వ్యవసాయ సమాచారం
బిజినేపల్లి మండలం పాలెంలో ఏర్పాటుచేసిన కృషి విజ్ఞానకేంద్రం ప్రధానంగా నీటి వినియోగం, సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నీటివృథాకు అడ్డుకట్ట వేయగలిగింది. ఈ కృషికిగాను జులై 23న నాబార్డ్ 38వ వ్యవస్థాపక దినోత్సవాల్లో పాలెం కృషి విజ్ఞానకేంద్రానికి ఉత్తమ సంస్థగా జాతీయ అవార్డు లభించింది.బిజినేపల్లి నుంచి నాగర్‌కర్నూలుకు వెళ్లే మార్గంలో పాలెం కృషి విజ్ఞాన కేంద్రాన్ని 2011లో కేంద్రీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలమూరు రైతులకు విలువైన వ్యవసాయ సమాచారం, నాణ్యమైన కొత్తరకం వంగడాలు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిందుసేద్య పద్ధతిని పాటించి ఒక ఎకరా వరికి పారించే నీటితో నాలుగెకరాల కూరగాయల పంటలను సాగుచేసి రైతులకు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో 60 శాతం నీటిని ఆదా చేయవచ్చని రైతులకు తెలియజేశారు.