Vegetables Cultivation: ఎంతో కష్టపడి సాగు చేసుకున్న కూరగాయల పంటకు సరైన ధర మార్కెట్లో లేకపోవడంతో కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వరి సాగు చేయవద్దని సూచించడంతో కూరగాయల సాగు వైపు మళ్లిన రైతులకు పండించిన పంటకు ధర లేకపోవడంతో తాము నష్టాల్లో ఉన్నామని వాపోతున్నారు. ఒక ఎకరం పొలంలో టమాట, మిర్చి, వంకాయ, కాకర, బీరా, చిక్కుడు లాంటి పంటలను సాగు చేసేందుకు 60 నుంచి 80 వేల వరకు ఖర్చు వచ్చిందని.. దిగుబడి బాగానే ఉన్నా మార్కెట్లో కూరగాయల ధరలు లేకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన టమాటాలను ఎక్కువ రోజులు నిలువ చేసుకోవడానికి రావడం లేదని.. 1, 2 రోజులు ఉంటే మొత్తం పాడైపోతుందన్న భయంతో మార్కెట్లో అతి తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు.
లాభం లేదు..
'వంకాయ, మిర్చి, బెండ, టమాట, చిక్కుడు, కాకర, సొరకాయ సాగు చేశా. కూరగాయలకు ధరలు లేక చాలా ఇబ్బందవుతోంది. సాగు కోసం 60 వేల వరకు పెట్టుబడి పెట్టిన.. కానీ ఇప్పటివరకు 20 వరకు కూడా రాబడి రాలేదు. అంతా దళారులు దోచుకుంటున్నారు. వనపర్తి మార్కెట్కు పోతే 25 కిలోల టమాట బాక్స్.. 100 లేదా 50 రూపాయలకు పోతోంది. ఏం లాభం లేదు.'
-మల్లయ్య, రైతు
దళారీ వ్యవస్థ దోచుకుంటోంది..
కూరగాయల మొక్కలను కొనుగోలు చేసే క్రమంలో ఒక్కో మొక్కకు 60 పైసల నుంచి రెండు రూపాయల దాకా చెల్లించి మొక్కలను కొనుగోలు చేశామని రైతులు పేర్కొంటున్నారు. వాటిని నాటేందుకు, బిందు సేద్యం పైపులు తదితర ఏర్పాట్ల కోసం 50-60వేలు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. కలుపు తీయడం, కూరగాయలను కోయడం, ఇతర అవసరాల కోసం మరో 20 నుంచి 30 వేల ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. 25 కేజీలు ఉండే ఒక బాక్సు టమాటాలను మార్కెట్కు తీసుకువెళ్తే మార్కెట్లో ఉన్న దళారీ వ్యవస్థ కేవలం వంద రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని.. అందులోనూ వారి మార్కెట్ కమిషన్ కూడా వసూలు చేసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.
నర్సరీలు ఏర్పాటు చేయాలి..