వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానం అవగాహన సదస్సులో మంత్రులు నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నదని, కరోనా సమయంలో సైతం ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, వాన కాలంలో పంటసాగు కోసం రైతులకు అందించేందుకు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రతి క్లస్టర్‌కు వ్యవసాయ అధికారులను నియమించిందని.. వెంటనే రైతు వేదికలను నిర్మించి ఎరువులు ,విత్తనాలు రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ను సస్యశ్యామలం చేసే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై త్వరలోనే జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించి ప్రణాళిక సిద్ధం చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
రైతుబంధు సమితులు సంఘటితమై ఉద్యమిస్తే భవిష్యత్తులో క్లస్టర్ వారిగా ఆ ప్రాంతంలోని ప్రజలకు అవసరమయ్యే వ్యవసాయ పంటలను, ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రతి జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, అగ్రికల్చర్ సెజ్, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. వానకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతుకు రైతుబంధు వస్తుందని.. రెండు నెలల్లో రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పారు .