Story about Koteshwar in WANAPARTHY: ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్నేళ్లు చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. అవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. సొంతంగా ఏదైనా చేయాలనుకున్నాడు. పదిమందికి ఉపాధి కల్పించాలని సంకల్పించాడు. కొన్నినెలల శోధన తర్వాత కౌజుపిట్టల పెంపకం మొదలుపెట్టాడు. ఐదేళ్లుగా దిగ్విజయంగా వ్యాపారం చేస్తూ.. కార్పొరేటు జీతం కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే నష్టాలు తప్ప లాభాలు లేవని ఆ యువకుడు చెబుతున్నాడు. మిశ్రమసాగు వల్లే రైతులు నష్టపోకుండా ఉంటారని నిరూపించాడు.
కౌజుపిట్టల పెంపకం ఎలా ఎంచుకున్నాడు: వనపర్తి జిల్లా దత్తాయిపల్లి గ్రామానికి చెందిన మన్నెయ్య- నీలావతి దంపతుల కుమారుడు కోటేశ్వర్. 2012లోనే ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్నేళ్లు అక్కడా, ఇక్కడా ఉద్యోగాలు చేశాడు. కానీ చేస్తున్న ఉద్యోగం పట్ల అతనికి సంతృప్తి లేదు. ఎన్నేళ్లు ఒకరి కింద పనిచేస్తూ జీవితాన్ని వెళ్లదీయగలమని.. తన కాళ్లపై తాను నిలబడాలని నిశ్చయించుకున్నాడు. వారిది వ్యవసాయ కుటుంబం అందుకే తనూ ఆ బాటలో సాగుతూ ఊళ్లోనే ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. కౌజుపిట్టల పెంపకం బాగుందని ఆ రంగాన్ని ఎంచుకుని, దాంట్లో లాభాలు గడిస్తున్నాడు.
ఎప్పుడు ప్రారంభించాడు:2017లో 10 లక్షల పెట్టుబడితో దీనిని ప్రారంభించినట్లు కోటేశ్వర్ చెబుతున్నాడు. అప్పటి నుంచి నూతనంగా ఆలోచించడం, మార్కెట్ నడిచే ట్రెండ్‌కు తగ్గట్టుగా మారితేనే వ్యాపారంలో విజయాలు సాధించగలమని తెలిపాడు. పలు ప్రాంతాల నుంచి వాటిని తీసుకువచ్చి దఫాల వారీగా పెంచుతున్నామని అన్నాడు. వాటి పెంపకం ఎలా చేయాలో తన అనుభవాన్ని యువకుడు వివరించాడు.
ఎలా లాభం పొందుతున్నాడు:కౌజు పిట్ట పిల్లల్ని10 రూపాయలకు కొని, వాటిని పెంచి 40 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నాడు. ప్రతి 10 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున 2వేల పిల్లల్ని పెంచుతారు. నెల రోజుల్లో 3 బ్యాచ్‌లు చేతికి వస్తాయని కోటేశ్వర్ చెప్తున్నాడు. ఈ వ్యాపారంలో శ్రమ తక్కువ. వెచ్చించాల్సిన సమయం కూడా తక్కువే అంటున్నాడు. రోజుకి 4 నుంచి 5 గంటలు శ్రమిస్తే చాలని చెబుతున్నాడు. అలాగే కౌజు పిట్టలే కాకుండా నాటుకోళ్లు, పొట్టేళ్లు పెంచుతున్నామని అంటున్నాడు.