Mortuaries in Vanaparthi Government Hospital: జీవితంలో చివరి మజిలీ అత్యధికులకు తీవ్ర అసౌకర్యాల నడుమ బాధాకరంగా ముగుస్తోంది. ఎవరు ఏ రకంగా కన్నుమూసినా ప్రభుత్వ దవాఖానాల్లో మృతదేహాలను భద్రపర్చడానికి తగిన సౌకర్యాలు లోపిస్తున్నాయి. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారు, బలవన్మరణాలకు పాల్పడినవారి మృతదేహాలను తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి, రెండు రోజుల పాటు భద్రపర్చాల్సివస్తే అందుకు ప్రధానంగా అవసరమైన ఫ్రీజర్లు (శీతలీకరణ పెట్టెలు) అందుబాటులో లేవు.
ఈ కారణంగా ఆస్పత్రుల్లోని శవాగారాల్లో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో శవాగారంలోకి వచ్చే పందికొక్కులు, ఎలుకలు కొరుక్కుతింటున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో శవాగారాల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. వసతులు లోపించడంతో బాధితులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు ఫ్రీజర్లు తెచ్చుకుంటున్నారు.
అద్దెల భారం..:ప్రభుత్వపరంగా శీతలీకరణ పెట్టెలు అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. అలాగే శవాగారంలో భద్రపరుస్తున్నారు. గంటలు, ఒకటి, రెండు రోజుల పాటు అలాగే ఉంచి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి దహన సంస్కారాలు పూర్తిచేసే వరకు ఫ్రీజర్లు అవసరమవుతున్నాయి.
ఒక్కో రోజుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఈ పెట్టెల కోసం ఖర్చు చేయాల్సివస్తోంది. అంత అద్దె చెల్లించలేనివారు శవాగారంలో అలాగే వదిలేస్తున్నారు. ఇక గుర్తుతెలియని వ్యక్తుల దేహాలను జాగ్రత్త చేయడానికి నానా అవస్థలు పడాల్సివస్తోంది. శవాగారంలో ఒకవైపు అలాంటి మృతదేహాల నుంచి దుర్వాసన వ్యాపిస్తుండగానే అక్కడే మరో శవానికి పోస్టుమార్టం చేయాల్సి వస్తోంది.