Revanth Reddy on Telangana Assembly Elections : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీచేస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. స్థానికంగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని కలిశారు. అనంతరం, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై, పోటీ అంశంపై చర్చించారు. టికెట్ కోసం తన తరఫున.. కొడంగల్ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌లో దరఖాస్తు అందజేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు.
Revanth Reddy on Kodangal : కొడంగల్‌ను దత్తత తీసుకుంటానన్న ముఖ్యమంత్రి ఏం చేశారనిరేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటే ఈ ప్రాంతానికి ఏం జరిగిందని నిలదీశారు. తాను చేసిన పనులకు శిలాఫలకాలు తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. రెండేళ్లలో కృష్ణా జలాలు తెస్తామన్న హామీ ఏమైందని? అన్నారు. ఓటమి భయంతోనే సీఎం రెండు చోట్ల పోటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే కేసీఆర్ ఆపద మెక్కులు మొక్కుతున్నాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఓటమి భయం ముఖ్యమంత్రి గొంతులో స్పష్టంగా తెలుస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాలు ఆక్రమించిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన రూ.4000 పింఛన్.. ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
"కొడంగల్‌ను దత్తత తీసుకుంటానన్న కేసీఆర్ ఏం చేశారు. నేను చేసిన పనులకు శిలాఫలకాలు తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. జిల్లాలు పెంచి కొడంగల్‌ను ముక్కలు చెక్కలు చేశారు. కొడంగల్‌కు రెండేళ్లలో కృష్ణా జలాలు తెస్తామన్న హామీ ఏమైంది. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఓటమి ఖాయమైనందునే ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాలు ఆక్రమించింది." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు