తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరిగొచ్చాం.. చేద్దామంటే పనిలేదు... తిందామంటే తిండిలేదు - వికారాబాద్ వలస కూలీల వార్తలు

కరోనా వైరస్ వలస కార్మికుల బతుకులను ఆగం చేసింది. కన్నవారిని, ఉన్న ఊరును విడిచి బుక్కెడు బువ్వకోసం పట్నం బాటపట్టిన బడుగుజీవులు... కరోనా భయానికి బతుకుజీవుడా అంటూ అతికష్టంమీద సొంతూళ్లకు చేరుకున్నారు. వచ్చాక అంతా సవ్యంగా ఉందా? అంటే... మళ్లీ అదే ఆకలి బాధ వెంటాడుతోంది. చేసుకుందామంటే పనిలేదు... చేతుల్లో చిల్లిగవ్వ లేదు. సర్కారు రేషన్ బియ్యంతో ఓ పూట గడుస్తున్నా పస్తులుండాల్సిన పరిస్థితి. చివరకు పసిపిల్లలకు ఇచ్చే అంగన్ వాడీ కోడిగుడ్లు, బాలమృతంతో ఆకలితీర్చుకునే దుర్భర స్థితుల్లో అల్లాడిపోతున్న వికారాబాద్ జిల్లా తండాల్లోని వలస కార్మికుల దయనీయ పరిస్థితిపై ఈటీవీ భారత్‌ ప్రత్యేక కథనం.

migrant workers problems
migrant workers problems

By

Published : Jun 30, 2020, 12:25 PM IST

వికారాబాద్ జిల్లాలో వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా అతికష్టం మీద ముంబయి, పుణె నుంచి సొంతూళ్లకు వచ్చిన వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేసేందుకు పనులు లేక... తినేందుకు సరిగా తిండిలేక అల్లాడిపోతున్నారు. వ్యవసాయ పొలాల్లో కూలీకి పోదామన్నా పిలిచేవారు కరవువడంతో గడప దాటని పరిస్థితుల్లో గుమ్మాల్లోనే గుబులు చెందుతున్నారు.

నేను ముంబయి నుంచి వచ్చా. ఉన్న పైసలన్నీ అక్కడే అయిపోయాయి. ఇక్కడికొచ్చాక పని లేదు. రెండు నెలలు అయింది. మేము బతికేది ఎలా?

-సక్రి, బండమీదితండా

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 7,500 మంది ముంబయి, పుణె వలస వెళ్లారు. అందులో ఒక్క కుల్కచర్ల మండలానికి సంబంధించి 3,600 మంది ఉంటారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, ఉపాధి దొరకకపోవడం వల్ల పస్తులుండే పరిస్థితుల్లో... వీరంతా వలసబాట పట్టారు. భవన నిర్మాణ కార్మికులుగా, తాపీ మేస్త్రీలుగా, డ్రైవర్లుగా, కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. పండుగలు, ఇతర శుభకార్యాలకు తండాలకు వచ్చిపోతుండేవారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో పనులన్నీ ఆగిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. సొంత గ్రామాలకు రాలేక కొన్నాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. సంపాదించిన కొద్దోగొప్పో డబ్బు... ఇంటి అద్దెలకు, తిండికి, బట్టకు సరిపెట్టారు. వెనక్కితిరిగి చూస్తే జేబుల్లో చిల్లిగవ్వ లేదు. అక్కడే ఉంటే ప్రాణాలకు దిక్కులేదని భావించి అయినవారి దగ్గర అప్పులు చేసి అతికష్టం మీద పిల్లాపాపలతో తండాలకు చేరుకున్నారు.

ముంబయిలో డ్రైవర్ పని చేశా. కరోనా వల్ల ఇక్కడికి వచ్చా. మాకు రేషన్ కార్డు లేదు. సర్పంచ్, వాళ్లువీళ్లు పెడితే తింటున్నాం. చేద్దాం అంటే పని లేదు.

- విజయ్, బురాన్ పల్లితండా

సొంతగూటికి చేరాక 28రోజులపాటు ఎవరూ గడప దాటలేదు. ఉన్నదాంట్లోనే తింటూ కాలం వెళ్లదీశారు. రోజులు గడిచేకోద్దీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. స్థానికంగా రేషన్ కార్డు లేకపోవడం, పనులకు ఎవరూ పిలవకపోవడంతో కూటికోసం అల్లాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వ్యవసాయం చేసుకుందామంటే భూమి లేదు. కూలీ పనులకు పోదామంటే రైతులెవరూ పిలువడం లేదు. పోనీ... హైదరాబాద్ వెళ్లి ఏదో ఒక పని చేద్దామనుకుంటే కరోనా వైరస్ భయం ఎక్కువగా ఉండటంతో ఇళ్లలోనే మగ్గిపోతున్నారు.

ఇక్కడ పని లేదు. పట్నం పోదాంటే కరోనాతో భయం. రేషన్‌ బియ్యం తినుకుంటూ బతుకున్నాం.

-సల్వాడ్ గణేశ్, బండమీది తండా

వలసపోయి తిరిగివచ్చిన కార్మికుల బతుకుపోరాటం ఒకలాగ ఉంటే... తండాల్లోనే ఉంటూ పస్తులండే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు స్థానికులు. కూలీ పనులు దొరకక ఇళ్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవేళ కూలీ చేసుకుందామని పొలాల్లోకి వెళ్తే వద్దని వారించే వారే తప్ప పని ఇచ్చే నాథుడు లేడు. ఇన్నాళ్లు రేషన్ బియ్యంతోనే పూట గడిచిన కుటుంబాలకు గత కొద్దిరోజులుగా ఆ తిండిగింజలూ దొరకడం లేదని వాపోతున్నారు. వయసును, ఆరోగ్య సమస్యలను సాకుగా చూపుతూ కొంతమంది పనులకు రావద్దని ముఖంమీదే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూలీకి ఎవరు పిలవడం లేదు. పోయినా వెనక్కి పంపిస్తున్నారు. రేషన్‌ బియ‌్యం వస్తున్నా.. కూరకు ఎట్లా.

-బుజ్జిబాయి, బురాన్ పల్లి తండా

నాకు వయ‌ుసు ఎక్కువ ఉందని పనికి పిలవట్లేదు. కరోనా వస్తే ఎలా అంటున్నారు. నాకు కొడుకులు లేరు. పని లేకపోతే బతకడం కష్టమే.

- సోనిబాయి, బురాన్ పల్లి తండా

తండాల్లో పనులు లేక పస్తులుంటున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆ కుటుంబాల్లోని పసి పిల్లలకు సరైన పౌష్టికాహారం లభించక బక్కచిక్కిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా తండాల్లోని అంగన్ వాడీలకు పాలు, కోడిగుడ్లు, బాలమృతం సరిపడా రాకపోవడంతో పిల్లలకు ఆహారం అందడం లేదు.

అంగన్‌ వాడీ స్కూల్‌ ఉన్నప్పడు పిల్లలకు పౌష్టికాహారం పెట్టేవాళ్లం. ఇప్పుడు ఇంటికి పంపిస్తున్నాం. వాళ్లు ఏం తింటున్నారో తెలియదు. తల్లిదండ్రులకు కూడా పనులు లేకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా పిల్లలకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంతోనే తల్లిదండ్రులు కూడా ఆకలితీర్చుకునే పరిస్థితి వచ్చింది.

-శారద, అంగన్ వాడీ ఉపాధ్యాయురాలు

ప్రస్తుత పరిస్థితుల్లో తండాలకు వచ్చిన వలస కార్మికులను మళ్లీ పొరుగు రాష్ట్రాలకు పంపేదే లేదని తండా పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా స్థానికంగానే ఉపాధి మార్గాలు చూపించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు.

వీళ్లను మళ్లీ ముంబయికి పంపించం. మేమే ఏమైన సాయం చేస్తాం. ఇక్కడే పని కల్పిస్తాం

-రవికుమార్, బండమీదితండా సర్పంచ్

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో ఏమైనా పని కల్పించే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ ఏరియాలో కరోనా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు పనులకు పంపించడం కూడా కష్టమే. కరోనా తగ్గితే ఇక్కడే పని కల్పించే ప్రయత్నం చేస్తాం.

-రాంలాల్, కుల్కచర్ల మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు

ఇదీ చదవండి:1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details