తెలంగాణ

telangana

ETV Bharat / state

అడుగంటిన జలాలు.. పెరుగుతున్న దాహం కేకలు - GROUND WATER

రాష్ట్రంలో బోర్లు ఎండిపోతున్నాయి. పల్లెల్లో దాహార్తి కనిపిస్తోంది. కడుపునిండా నీళ్లు తాగుదామంటే... అవి కూడా కరువయ్యాయి. తాగు నీటికోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం 21 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు దిగువకు పడిపోయాయి. ఏప్రిల్​లోనే.. ఇలా ఉంటే మే నెల వచ్చే సరికి ఎలా ఉంటుందోనని పల్లెవాసులు భయపడుతున్నారు.

అడుగంటిన జలాలు.. పెరుగుతున్న దాహం కేకలు

By

Published : Apr 15, 2019, 7:17 PM IST

Updated : Apr 15, 2019, 7:23 PM IST

రాష్ట్రంలో దాహం కేకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​ భగీరథ కింద తాగునీరు అందని ప్రాంతాల్లో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ప్రధానంగా సంగారెడ్డి, మేడ్చల్​, జోగులాంబ, గద్వాల్, మహబూబ్​నగర్​, మెదక్​, వికారాబాద్​, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎండల తీవ్రత కారణంగా మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉంది.

తగ్గిపోతున్న భూగర్భజలాలు:

అధికంగా నీటిని వినియోగించడం, వర్షపాతం, తేమ పడిపోవడం వలన భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. ఆదిలాబాద్​, నల్గొండ, తదితర జిల్లాల్లో గిరిజన తండాల్లో తాగునీటికోసం బోర్లు, చేతి పంపుల వద్ద నానా తిప్పలు పడుతున్నారు. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో జనం నీటికోసం బిందెలు తీసుకుని మండుటెండల్లో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

పెరిగిన ఎండల తీవ్రత:

గత ఏడాదితో పోల్చితే.. ఈ సంవత్సరం 21 జిల్లాల్లో భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ గుర్తించింది. సగటున 1.52 మీటర్లు దిగువకు వెళ్లాయి. ఏప్రిల్​, మే, జూన్​ మాసాల్లో ఎండల తీవ్రతతో నీటికొరత మరింత ఏర్పడనుంది. రాష్ట్రంలో గత ఏడాది జూన్​ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 865 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ 16 శాతం తక్కువగా 724 మీటర్లు మాత్రమే నమోదైంది. ఆ ప్రభావం భూగర్భ జల మట్టంపై పడింది.33 జిల్లాల్లో గత ఏడాది మార్చితో పోలిస్తే... 21 జిల్లాల్లో 7.55 నుంచి 0.09 మీటర్ల వరకు తగ్గుదల నమోదైంది. అంతేకాకుండా... జలాల వినియోగంపై ఒత్తిడి కూడా అధికంగా ఉండటం వలన ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 0.89 మీటర్లు వరకు తరుగుదల నమోదైనట్లు తాజా నివేదికలో తెలంగాణ రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ వెల్లడించింది.

ఎండిపోతున్న బోర్లు:

రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోనే నీటికి కటకట పరిస్థితి ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రాష్ట్రంలోనే అత్యంత లోతులో భూగర్భ జలం ఉన్నట్లు గుర్తించారు. మిషన్ భగీరథ పనులు పూర్తి కాని గ్రామాల్లో ప్రజలు బోర్లపై ఆధారపడుతున్నారు. నీళ్లు ఇంకిపోవడంతో బోర్లు కూడా సరిగా పనిచేయడం లేదు. వ్యవసాయ బోర్లు కూడా తడారిపోతున్నాయి. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం లాంటి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బోర్లు ఎండిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు.

రాష్ట్రంలో అంచనా వేస్తే... 15.6 శాతం భూభాగంలో 20 మీటర్లకు పైబడి లోతులో భూగర్భ జల నీటి మట్టం ఉంది. రాబోయే రోజుల్లో ఇదొక ప్రమాదఘంటికనే అని చెప్పుకోవచ్చు.

అడుగంటిన జలాలు.. పెరుగుతున్న దాహం కేకలు

ఇదీ చూడండి: నడిరోడ్డు మీద ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి

Last Updated : Apr 15, 2019, 7:23 PM IST

For All Latest Updates

TAGGED:

GROUND WATER

ABOUT THE AUTHOR

...view details