వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో వానాకాలంలో రైతులు సాగు చేయాల్సిన పంటలపై గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. గతంలో రైతులకు సీజన్ల వారీగా ఏ పంట సాగు చేయాలనేదానిపై అవగాహన లేక నష్టపోయారని తెలిపారు. సర్కారు అన్నదాతలకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తోందన్నారు. వానాకాలంలో వరి, కంది పంటను ఎక్కువగా సాగు చేయాలని కర్షకులకు సూచించారు. మొక్కజొన్న పంట మాత్రం వేయవద్దని చెప్పారు.
'నియంత్రిత పద్ధతిలో పంటలను సాగు చేయాలి '
రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. నియంత్రిత పద్ధతిలోనే పంటలను సాగు చేయాలని అన్నదాతలకు సూచించారు. రైతుబంధు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రైతుబంధు పథకం విషయంలో అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఖాతాలో రైతుబంధు డబ్బులు వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో రానివారు ఎవరైనా ఉంటే వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్లి తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా రెండు పర్యాయాలు తమకు రైతుబంధు రావడం లేదని... ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే వారి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ఏవో బాలాజీ ప్రసాద్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశముఖ్ ,వ్యవసాయ శాఖ విస్తరణాధికారి వినయ్ కుమార్, రైతుబంధు సమితి కమిటీ సభ్యులు, కౌన్సిలర్ మధు యాదవ్, పీఏసీఎస్ ఛైర్మన్ శివకుమార్, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు