పల్లెలు మద్యం మత్తులో జోగుతున్నాయి. పదేళ్ల పిల్లాడి నుంచి పండు ముసలి వరకు మద్యానికి బానిసవుతున్నారు. చేజేతుల ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపులు, దుకాణాల్లోనూ మద్యం దొరుకుతుండటం వల్ల మందుబాబులు(Alcohol addicts in Villages) రాత్రింబవళ్లు కిక్కులో మునిగితేలుకుతున్నారు. ఈ వ్యవహారంపై ఆబ్కారీ, పోలీసుల అధికారులకు ఫిర్యాదు అందుతున్నా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వీరికి ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొడంగల్ మండలం రావుపల్లిలో 38, హస్నాబాద్ 9, అన్నారం 6 చొప్పున గొలుసు దుకాణాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ మండలంలోని మేజర్ పంచాయతీలో గొలుసు దుకాణాల్లోనే రోజుకు రూ.లక్షల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం.
జిల్లాలో 19 మండలాలు, 571 పంచాయతీలున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మొత్తం 46 వైన్ షాపులు, 6 బార్ల నిర్వహణకు అనుమతి ఉంది. మద్యం దుకాణాలు 95 శాతం పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలను ప్రోత్సహించేందుకు నేరుగా లైసెన్స్ దుకాణం నుంచి వాహనాల్లో సరఫరా చేస్తున్నారు. వారంలో మూడు రోజులు గ్రామాలకు వాహనాలు వచ్చి, సరకు దించిపోతున్నారని సమాచారం. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఆబ్కారీ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి, ఊటను ధ్వంసం చేస్తున్న అధికారులు, గొలుసు దుకాణాలపై చర్యలు తీసుకోవడం లేదు. పట్టణాలకు సుమారుగా 5 కిలోమీటర్లు దాటితే ఆయా గ్రామాల్లో నిత్యావసర సరకులతో పాటు మద్యం లభిస్తోంది. కుల్కచర్ల మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మూడు కంటే ఎక్కువ దుకాణాలు కొనసాగుతున్నాయి. ధారూర్, బషీరాబాద్, కొడంగల్, తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి.
కుటుంబాల్లో చిచ్చు :
గ్రామాల్లో మద్యం లభిస్తుండటంతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పరిగి మండలంలో ఓ వ్యక్తి మద్యం తాగేందుకు డబ్బుల కోసం భార్యాపిల్లలను వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయారు. డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే సదరు వ్యక్తి హత్య చేసిన సంఘటన కలిచివేసింది. వికారాబాద్ మండలం పులుసుమామిడిలోనూ ఈ తరహా సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వికారాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇదే విషయమై భార్యను వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యక్తిని మందలించి, కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
తీర్మానానికే పరిమితం: జిల్లాలోని 19 మండలాల పరిధిలో 50కిపైగా పంచాయతీలు మద్య నిషేధ]ంపై తీర్మానాలు చేశాయి. బషీరాబాద్ మండలం మంతట్టి, వికారాబాద్ మండలం సిద్దులూరు, మోమిన్‌పేట్ మండలం దేవరంపల్లి, మేకవనంపల్లి, హిజ్రాచిట్టెంపల్లి, కొడంగల్ మండలం అంగడిరాయిచూర్, అప్పాయిపల్లి తదితర పంచాయతీల్లో మద్యం నిషేధానికి తీర్మానాలు చేశారు. అవగాహనకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రతులను పోలీసులు, ఆబ్కారీ అధికారులకు అందించారు. తొలినాళ్లలో ఒకటి, రెండు నెలల పాటు సరఫరా నిలిపివేశారు. అనంతరం నెమ్మది మళ్లీ పారంభించారు. అప్పటి కంటే ప్రస్తుతం దుకాణాల సంఖ్య పెరగడం విశేషం.
దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నాం
ప్రధానంగా నాటు సారా తయారీపై దృష్టి సారిస్తున్నాం. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తున్నాం. గొలుసు దుకాణాల విషయంలోనూ ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటున్నాం.