వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాండూరు మండలం బెల్కటూర్ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. ఈ క్రమంలో బెల్కటూర్‌కు చెందిన గర్భిణీని రైలు పట్టాలపై తరలించారు.
వాగు ఉద్ధృతితో తప్పని తిప్పలు
గర్భిణీకి ఆదివారం పురిటినొప్పులు రాగా... అంబులెన్స్‌కు కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. అయితే వాగుకు వరద ఉద్ధృతితో అంబులెన్స్ రాలేని పరిస్థితి నెలకొంది. చేసేది లేక స్థానికులు ఆమెను రైలు పట్టాలపై 2 కి.మీ. మేర ట్రాక్ బండిపై తరలించారు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వర్ష బీభత్సం
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. ఇప్పటికే తాండూర్ హైదరాబాద్ మార్గంలో రాకపోకలు వారం రోజులుగా నిలిచిపోయాయి. కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ ప్రజలు అల్లాడుతున్నారు. అరగంట నుంచి గంట వ్యవధిలోనే శనివారం మధ్యాహ్నం ఏకధాటిగా పలు ప్రాంతాల్లో వాన పడింది. రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరో 4 రోజుల పాటు ఇలాగే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న సూచించారు. ఎగువ నుంచి భారీ వరద రావడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగింది. అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ మధ్య సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. యాకత్‌పురా లోతట్టు బస్తీ, సైదాబాద్‌లోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద చేరింది. అంబర్‌పేటలోని ఆబ్కారీ కార్యాలయంలో అడుగు లోతు నీరు నిలిచింది.
ఇదీ చదవండి:TS Police: కాళ్లకు చెప్పులు లేకుండా పరుగెత్తి.. అంబులెన్సుల్లోని రోగుల ప్రాణాలు నిలబెట్టి!