లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి పూట గడవడమే కష్టంగా మారిందని యాదాద్రి జిల్లాలోని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటనర్సు కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు.
కలెక్టరేట్ ఎదుట చేనేత కార్మికుల నిరసన - యాదాద్రి జిల్లా చేనేత కార్మికులు
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట చేనేత కార్మికులు నిరసన తెలిపారు. కరోనా లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలంటూ కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు.
ఆపత్కాలంలో తక్షణ సాయంగా ప్రతి చేనేత కుటుంబానికి రూ. 10 వేలు, నిత్యావసరాలను ఉచితంగా అందజేయాలని వెంకటనర్సు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం మాదిరిగా.. రాష్ట్రంలో కూడా సంవత్సరానికి రూ. 30 వేలను ఆర్థిక సాయంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. త్రిప్ట్ పథకాన్ని వెంటనే ప్రారంభించి.. చేనేత మిత్ర పథకం ద్వారా ఇస్తున్న నూలుపై సబ్సిడీని ప్రతి నెల కార్మికునికే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే కార్మికులకు రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.