భువనగిరిలో ఇల్లు కట్టిస్తామంటూ డబ్బులు వసూలు చేసి ఉడాయించిన ఉదంతం మరవక ముందే... సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో ఇంకో ఘటన వెలుగుచూసింది. సొంతిల్లు కట్టుకోవాలనుకునే పేదలే లక్ష్యంగా డబ్బులు దండుకున్న మాలవీ కరుణోదయ సంస్థ ఆగడాలు బట్టబయలయ్యాయి. లబ్ధిదారు వాటాగా 30 వేలు చెల్లిస్తే... 7లక్షల 50 వేల విలువైన ఇంటిని నిర్మిస్తామంటూ... దాదాపు 10 లక్షలకుపైగా వసూలు చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల ఫొటోలు చూపించి తాము నిర్మించినవేనని సంస్థ ప్రతినిధులు చెప్పారు. స్థలం ఉంటే చాలు అన్నీ మేమే చూసుకుంటామంటూ నమ్మబలికారు.
ఇల్లొస్తుందని ఆశపడితే... డబ్బు కొట్టేశారు
ప్రతి ఒక్కరు తనకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోతే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ఆశిస్తారు. అలాంటి వారి కోరికలను ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకుంటున్న ఓ సంస్థ నిర్వాకం ఇది...
పేదలకు మేలు చేసే సంస్థగా భావించిన పలు గ్రామాల ప్రజలు డబ్బులు చెల్లించారు. జగదేవ్‌పూర్ మండలంలో 22 మంది 30 వేల చొప్పున చెల్లించారు. మొదటి విడతలో లబ్ధిదారుని వాటా కింద 2 లక్షల 80 వేలు చెల్లించాల్సి ఉండగా... ఆ మొత్తాన్ని ఇల్లు కేటాయించిన అనంతరం చెల్లించొచ్చని, ప్రస్తుతానికి సంస్థ భరిస్తుందని చెప్పారు. నిజమనుకుని ఒకరిని చూసి ఒకరు చెల్లించారు. ఆరు నెలలు గడుస్తున్నా... ఫలితం లేకపోవడం, ప్రతినిధుల ఫోన్ నెంబర్లు పనిచేయకపోవడం, ఇంతలోనే పలు దినపత్రికల్లో సంస్థ నిర్వాకం గురించి కథనాలు వచ్చాయి. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
ఇదీ చూడండి:'నువ్వు లేని జీవితం నాకొద్దు'