తెలంగాణ

telangana

ETV Bharat / state

TS-AP WATER WAR: 'ఆ రెండు ప్రాజెక్టుల్లో నిరంతరంగా జల విద్యుత్​ ఉత్పత్తి' - telangana projects news

నీటి పంపకాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోన్న వేళ.. నాగార్జునసాగర్​, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుత్​ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో విద్యుత్​ ఉత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. నిరంతర ఉత్పత్తి జరుగుతుందని జెన్​కో అధికారులు వెల్లడించారు. రెండు ప్రాజెక్టుల వద్ద పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు.

'ఆ రెండు ప్రాజెక్టుల్లో నిరంతరంగా జల విద్యుత్​ ఉత్పత్తి'
'ఆ రెండు ప్రాజెక్టుల్లో నిరంతరంగా జల విద్యుత్​ ఉత్పత్తి'

By

Published : Jul 2, 2021, 6:43 PM IST

Updated : Jul 2, 2021, 7:39 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు జలాశయాల వద్ద.. యథాతథస్థితి కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బలగాలు.. ఇరువైపులా తమ తమ భూభాగాల్లో మోహరించాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుల వద్ద గత నెల 29న విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభించారు. అప్పటి నుంచి గత నాలుగు రోజులుగా నిరంతరాయంగా రెండు జలాశయాల వద్ద జెన్​కో అధికారులు విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారు. జూన్ 29 మధ్యాహ్నం సాగర్​లో, రాత్రి ఎనిమిదిన్నరకు పులిచింతలలోని యూనిట్లలో ఉత్పత్తి మొదలైంది. పులిచింతల వద్ద రెండు యూనిట్ల ద్వారా విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోందని జెన్​కో తెలిపింది. మరోవైపు డ్యామ్​కు ఎగువ నుంచి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 21.5 టీఎంసీల నీరు ఉంది. గడచిన 24 గంటల్లో 5 టీఎంసీల నీరు అదనంగా వచ్చి చేరింది.

సాగర్ ఆనకట్ట, పవర్ హౌస్​, ఇరు రాష్ట్రాల రహదారి అయిన కొత్త వంతెన వద్ద గత రెండ్రోజుల మాదిరిగానే 250 మందితో భద్రత కొనసాగుతుండగా.. పులిచింతల వద్ద బలగాల సంఖ్యను పెంచారు. పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో నిన్నటి వరకు 90 మందితో పహారా కొనసాగించిన అధికారులు.. ఇవాళ్టి నుంచి ఆ సంఖ్యను 200కు పెంచారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆధ్వర్యంలో పటిష్ఠ నిఘా కొనసాగుతోంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు మీదుగా ప్రజల రాకపోకలను నిషేధించారు. డ్యామ్ మీదుగా సాగే ప్రయాణానికి అడ్డుకట్టపడటంతో.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి.

నీటి పంపకాల్లో కేంద్రం కూడా వివక్ష చూపుతోంది..

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని మంత్రి శ్రీనివాస్​గౌడ్ ఆరోపించారు. ప్రాజెక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరడాన్ని ఖండించిన ఆయన.. ఏపీ ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా అని ప్రశ్నించారు. నీటి పంపకాల్లో కేంద్రం కూడా వివక్ష చూపుతోందని దుయ్యబట్టారు. కృష్ణా బేసిన్​లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులే లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న సెటిలర్స్ అంతా తమ వారేనని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ భరోసా కల్పించారు.

ఇదీ చూడండి: TS-AP water war: 'అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోంది'

Last Updated : Jul 2, 2021, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details