దేశవ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు విస్తృతంగా జరుగుతున్నాయిని.. తెలంగాణలో పరీక్షల నిర్వహణ సంఖ్య చాలా తక్కువగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు . జాతీయ స్థాయి కంటే రాష్ట్రంలో సగటు తక్కువగా ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమన్నారు. సగటున పది లక్షల మందిలో వెయ్యి మందికే పరీక్షలు చేస్టున్నారని ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయని ఉత్తమ్ అన్నారు.
పక్క రాష్ట్రమే నయం...
పక్క రాష్ట్రం ఏపీలో సగటున 9 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తే... మహారాష్ట్రలో 5 వేల మందిని పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. చత్తీస్ ఘడ్లో 4 వేలు మేర పరీక్షలు చేస్తున్నారని అన్నారు. దేశంలో సగటున ప్రతి పది లక్షల మందిలో 4వేల కొవిడ్ వైద్య పరీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇది సీఎం కేసీఆర్కు సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ తీరు వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తుగ్లక్ మాదిరి లెక్కలు చెబుతూ..రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారని ఆందోళన వ్యక్తం చేశారు.
4 కోట్ల మందికి ఒక్కటేనా ?
గ్రేటర్ హైదరాబాద్లోని 30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల పరీక్షలు చేస్తామన్న కేసీఆర్ మాట ఆ దేవుడికే తెలియాలన్నారు. లాక్డౌన్ కాలంలో కంటైన్మెంట్ జోన్ వద్ద లిక్కర్ దుకాణాలు తెరవడంపై ఉత్తమ్ మండిపడ్డారు. మందు దుకాణాలు నిర్వహించడం వల్లే కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తోందన్నారు. సుమారు 4 కోట్ల మందికి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ ఒక్కటే ఉండటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమన్నారు.