కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన తెరాస నాయకుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు (52) కుటుంబ సభ్యులతో పట్టణంలోని కేఎల్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం వెంకటేశ్వర్లుతోపాటు ఆయన తల్లిదండ్రులు అంజమ్మ(70), రంగయ్య(75)కు కరోనా నిర్ధరణ అయింది. వారిద్దరూ కోదాడలోనే హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న కరోనా - కోదాడలో కరోనాతో ముగ్గురు మృతి
కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా విజృంభిస్తోంది. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడలో ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలను లాక్కెళ్లింది. గడిచిన వారం రోజుల్లో కోదాడ నియోజకవర్గంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి తల్లి అంజమ్మ మృతి చెందగా.. తండ్రి రంగయ్య శనివారం ఉదయం చనిపోయారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. 24 గంటల్లో ఒకే ఇంట్లో ముగ్గురిని కరోనా పొట్టనపెట్టుకోవడంతో కోదాడతోపాటు మృతుల స్వగ్రామమైన చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ (34) కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
ఇదీ చూడండి:కరోనా పరీక్ష ఆలస్యం.. అవుతోంది ప్రాణాంతకం!