భారత్-చైనా సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కొల్పోయిన వీరజవాన్లకు వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు నివాళులు అర్పించాయి. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనాతో ప్రపంచం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే చైనా తన మీద ఉన్న అపవాదులను పక్కదారి పట్టించేందుకు సరిహద్దుల్లో హడావుడి సృష్టిస్తుందని విమర్శించారు. భారత్‌పై కుట్రలు ఆపి.. కరోనాకు మందును కనిపెట్టేందుకు కృషి చేయాలని హితవు పలికారు.
యువజన సంఘం ఆధ్వర్యంలో
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో మహి మెమోరియల్ యువజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నామ సుభద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాదాద్రిలో భాజపా నాయకులు అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
కొవ్వొత్తులతో
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కాంగ్రెస్ నాయకులు సంతోశ్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మిర్యాలగూడలో అమరవీరుల స్తూపం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. హుజూర్ నగర్ శాంతి స్తూపం వద్ద ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. కరీంనగర్ గీతాభవన్ వద్ద కలెక్టర్ శశాంక... సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం ప్రకటించారు. భువనగిరికి చెందిన కళాకారుడు ఉప్పుతో సంతోష్‌బాబు చిత్రాన్ని తీర్చిదిద్దారు.