సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై ఉంది. సుమారు 530 మంది విద్యార్థులతో సంఖ్యా పరంగా జిల్లాలో రెండో స్థానంలో ఉందీ విద్యాసంస్థ. మూడేళ్ల కిందట రోడ్డు వెడల్పు జరిగినప్పుడు ముందు భాగంలో కొంత స్థలం పోయింది. ఇక్కడే ఇప్పుడు తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటుచేశారు. ఇదే పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించారు. తర్వాత దుకాణ సముదాయాలూ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా విద్యార్థులు ఆడుకునే అవకాశాలు కోల్పోయారని, పైపెచ్చు ఆటల పేరుతో స్థానిక యువకులు ఇక్కడే తచ్చాడుతుండటంతో విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
రైతు బజార్లు, క్రీడా ప్రాంగణాలు, మాంసం మార్కెట్ల ఏర్పాటుకు ఏది సరైన స్థలం? ఈ ప్రశ్నకు ఎవరైనా ఊళ్లో అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతమో, శివారు స్థలమో అని ఠక్కున సమాధానమిస్తారు. అధికార యంత్రాంగానికి మాత్రం కళాశాలలు, పాఠశాలల్లోని క్రీడా మైదానాలే కన్పిస్తున్నాయి. ఎవరు అనుమతిస్తున్నారో తెలియదుగానీ, కలెక్టర్ ఆదేశాలంటూ అధికారులు అక్కడ బోర్డులు పెట్టేస్తున్నారు. వెనువెంటనే నిర్మాణాలూ జరిగిపోతున్నాయి. ఫలితంగా భవిష్యత్తు అవసరాలు, విస్తరణకు స్థలాలు లేని విధంగా విద్యా సంస్థలు మారుతున్నాయి.విద్యాసంస్థల స్థలాలను విద్యేతర కార్యకలాపాలకు కేటాయించరాదనే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ‘ఈనాడు’ పరిశీలన కథనం..
20 జూనియర్ కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు
స్థానికులు వ్యాయామం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఊళ్లో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఆ లక్ష్యం బాగానే ఉన్నా.. అందుకు అనువైన స్థలాలు లేవనే నెపంతో వాటిని జూనియర్ కళాశాలలు, పాఠశాలల స్థలాల్లోనే ఏర్పాటు చేయడమే విమర్శలకు తావిస్తోంది. నెల రోజుల వ్యవధిలో 20 కళాశాలల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల పేరుతో ఇటీవల బోర్డులు పాతారు. ఒక్కో దానికి ఎకరం వరకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే పిండిప్రోలు, పెనుబల్లి, కామేపల్లి, బోనకల్ జూనియర్ కళాశాలల్లో బోర్డులు పెట్టారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇవిగాక పలుచోట్ల మార్కెట్లు, రైతు బజార్ల నిర్మాణాలకూ కళాశాలల స్థలాలనే కేటాయిస్తున్నారు. మహబూబ్‌నగర్ డైట్ కళాశాల స్థలంలో మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను మొదలుపెట్టారు.
ఇవీ నష్టాలు...భయాలు
* భవిష్యత్తులో విద్యాసంస్థలను విస్తరించే అవకాశాలు ఉండవు.
* తరగతులు జరిగే సమయంలో క్రీడా ప్రాంగణాల్లోకి ప్రజలు రాకపోకలు సాగిస్తే విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడవచ్చు.