తెలంగాణ

telangana

ETV Bharat / state

Tragedy: అమ్మానాన్నలకు అండగా ఉండాలనుకున్నాడు.. మంచానికే పరిమితమయ్యాడు! - తెలంగాణ వార్తలు

రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఇంట్లో నానాటికి పెరుగుతున్న ఆర్ధిక ఇబ్బందులను చూడలేక చిన్నతనం నుంచే భవన నిర్మాణ కార్మికుడి అవతారం ఎత్తాడు. కూలీ పని చేస్తూ కుటంబానికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. కానీ విధి వక్రీకరించంది. ఆ నిరుపేద కుటుంబాన్ని మరింత పేదరికంలోని నెట్టింది. అంతేకాకుండా చెట్టంత కొడుకును మంచాన పట్టేలా చేసింది. పదేళ్లుగా మంచానికే పరిమితమైన కొడుకు ఆలనాపాలనా చూస్తున్న ఆ తల్లిదండ్రులు... సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tragedy, parents need help for son
సాయం కోసం ఎదురు చూపులు, వైద్యం కోసం దాతలకు విజ్ఞప్తి

By

Published : Aug 29, 2021, 7:24 PM IST

అమ్మానాన్నలకు అండగా ఉండాలనుకున్నాడు.. మంచానికే పరిమితమయ్యాడు!

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అమ్మానాన్నలను చూసి చిన్న వయసులోనే భవన నిర్మాణ కార్మికుడిగా పని మొదలుపెట్టాడు ఆ యువకుడు. అలా కొంతకాలం పనిచేసి కుటుంబానికి ఆదెరువుగా ఉన్నాడు. చేతికందవచ్చిన కొడుకు తమకు అన్ని రకాలుగా అండగా ఉంటాడనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ అనుకోని ప్రమాదంతో అతడి జీవితం మంచానికే పరిమితమైంది. రోజూలాగే ఒకరోజు కోదాడలో పని చేస్తుండగా ఓ భవనం ఐదో అంతస్తు నుంచి కిందపడి పదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం ఎక్లాస్​ఖాన్ పేట గ్రామానికి చెందిన చెరుకుపల్లి సాయి కుమార్ విషాద గాథ ఇది. మంచాన పడిన కుమారుడికి మెరుగైన వైద్యం చేయించే స్తోమత లేక దాతల కోసం ఎదురు చూస్తున్నారు ఆ వృద్ధ తల్లిదండ్రులు.

ఆశలు అడియాసలు

చదువును పక్కన పెట్టి తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా ఉండాలనుకున్న ఆ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి. సాఫీగా సాగాల్సిన జీవితం మంచాన పడింది. 2010లో కోదాడలోని బస్టాప్ పక్కన గల ఓ భవనం ఐదో అంతస్తు నుంచి కింద పడటంతో వెన్నుపూస విరిగింది. రెండు కాళ్లు చచ్చుపడ్డాయి. కదలలేక పదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. నిరుపేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం అందక రెండు కాళ్లకు విషం పారి... నల్లగా మారాయి. వైద్యం అందక యువకుడి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది.

పొలం అమ్మి వైద్యం

మా కుమారుడికి కొందరు సాయం చేశారు. కానీ అవి సరిపోకపోవడం వల్ల మాకు ఉన్న అర ఎకరం పొలాన్ని అమ్మినం. ఆ డబ్బులతో వైద్యం చేయించాం. అయినా పెద్దగా ఫలితం లేదు. పదేళ్లుగా మందులు వాడుతూనే ఉన్నాడు. మాకు వయసు మీద పడింది. వైద్య ఖర్చులకు నెలకు రూ.20వేల దాకా అవుతున్నాయి. తిండికి కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. ఎవరైనా దాతలు సాయం చేయాలి. పింఛన్ ఇప్పించండి.

-సాయికుమార్ తల్లిదండ్రులు

అన్న జీవితం త్యాగం

మంచానికే పరిమితమైన తమ్ముడు సాయికుమార్ కోసం... అన్న హరీశ్ పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. వైద్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. హైదరాబాద్​లో కూలీ పని చేసి కొంత సొమ్మును పంపిస్తున్నారు. భార్య వస్తే తమ్ముడు దూరమవుతాడని వివాహ బంధానికి దూరంగా ఉన్నారు. తాను సంపాదించే డబ్బులు తమ్ముడికి మెరుగైన వైద్యం కోసం సరిపోవడం లేదని... ప్రభుత్వం, దాతలు స్పందించి తన తమ్ముడిని ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు..

పదేళ్లుగా మంచానికే పరిమితమైనప్పటికీ అధికారులు ఆధార్ కార్డు కూడా ఇవ్వడం లేదు. రేషన్ కార్డు లేదు. సాయి కుమార్ మీ-సేవకు వెళ్లలేని పరిస్థితి. ఫలితంగా ఆసరా పింఛన్​ వస్తలేదు. ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్ వచ్చేలా చేయాలి.

-సాయి కుమార్ తల్లిదండ్రులు

భవనంపై నుంచి కిందపడిన సాయికుమార్ పదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. అతడికి కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. రేషన్ కార్డు లేదు. పింఛన్ వస్తలేదు. ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నాం. ఎవరైనా దాతలు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-గ్రామస్థులు

ఇదీ చదవండి:yadadri: దేదీప్యమానంగా యాదాద్రి.. ముమ్మరంగా ఆలయ అభివృద్ధి పనులు

ABOUT THE AUTHOR

...view details