సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం వెంకేపల్లికి చెందిన పాపయ్య దంపతుల కష్టాలపై ఈటీవీ భారత్(Mla Response to Etv Bharat Story) "వృద్ధ్యాప్యంలో అష్టకష్టాలు.. తొమ్మిది పదుల వయసులో బుట్టలు అల్లుతూ..!" అనే కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్(Thungathurthy MLA Gadari Kishore) స్పందించారు. వెంటనే దంపతుల వద్దకు వెళ్లి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా.. దంపతులకు పింఛన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
96 ఏళ్ల పిట్టల పాపయ్య, రామనర్సమ్మ దంపతులు వృద్ధాప్య పింఛన్ అందక ఇబ్బంది పడుతున్నారు. పాపయ్యకు కళ్లు కనిపింవు... చెవులు, వినిపించవు. కన్న కొడుకు కాలం చేశాడు. కళ్లు కనిపించకపోయినా కులవృత్తిని నమ్ముకొని బుట్టలుఅల్లుతూ జీవనం సాగిస్తున్నారు. గతంలో 2వేల వృద్ధాప్య పింఛన్ అందుకునే పాపయ్య ఆధార్ అనుసంధానం చేసే క్రమంలో ఐరిస్ సరిపోలలేదు. పింఛన్ రద్దవగా.. భార్య రామనర్సమ్మకు వచ్చే రేషన్ బియ్యంతోనే కాలం వెల్లదీస్తున్నారు. వృద్ద దంపతుల దయనీయ స్థితిపై ఈనెల 9న ఈటీవీ భారత్ "వృద్ధ్యాప్యంలో అష్టకష్టాలు.. తొమ్మిది పదుల వయసులో బుట్టలు అల్లుతూ..!" కథనం ప్రసారం చేసింది. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ వెంకేపల్లి గ్రామానికి వెళ్లి వృద్ధ దంపతులను పరామర్శించారు. నివాసం కోసం తక్షణ సాయం కింద రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అంగవైకల్యం కింద పింఛన్ వచ్చేలా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు.
"ఈ దంపతులపై ఈటీవీ భారత్ కథనాన్ని చూశాను. కాటికికాలు చాపిన వయస్సులోనూ ఎవరిపై ఆధారపడకుండా బుట్టలు అమ్ముతూ జీవిస్తున్న ఈ దంపతులను చూసి ముచ్చటేసింది. వారి కష్టాలు నన్ను కదిలించాయి. చనిపోయేవరకు ఆత్మగౌరవంతో బతకాలన్న వారి పట్టుదల నాకు నచ్చింది. వారికి నేను చేసింది సాయం కాదు. ఇది నా బాధ్యత.. వారి హక్కు. వారి కష్టాన్ని నా వరకు తీసుకొచ్చిన ఈటీవీ భారత్‌కు అభినందనలు."