Congress Protest: వరి ధాన్యానికి కనీస మద్దతు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సుర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తక్కువ ధరకు విక్రయించడానికి నిరాకరించి.. మార్కెట్లో నుంచి ధాన్యాన్ని తిరిగి తీసుకువెళ్తున్న రైతులను కలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. వారికి మద్దతుగా 48 గంటల నిరసన దీక్షకు పూనుకున్నారు. వరి కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించేవరకు ఆందోళన విరమించేదిలేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
సుర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధర దక్కడంలేదని ఆగ్రహించిన అన్నదాతలు నిన్న ఆందోళనకు దిగారు. తక్కువ ధరలు నిర్ణయించిన వ్యాపారులు టెండర్లు పూర్తి చేసి ధాన్యాన్ని కాంటాలకు సిద్ధమవుతుండగా.. అడ్డుకున్న రైతులు ధర్నా నిర్వహించారు. గత రెండు రోజుల వరకు క్వింటాకు 1800 వందల నుంచి 1900 వరకు ధరలు చెల్లించిన వ్యాపారులు.. ఒక్కసారిగా ధరలు తగ్గించారు. దీనిపై ఆగ్రహించిన అన్నదాతలు ధర్నాకు దిగడంతో.. దిగొచ్చిన అధికారులు ధాన్యం రాశులకు తిరిగి టెండర్లు వేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన వ్యాపారులు, మార్కెట్ అధికారులు 1400 రూపాయల ధరకు తగ్గకుండా టెండర్ వేయాలని నిర్ణయించారు.